వ్యాపారి కిడ్నాప్ కేసు‌ దర్యాప్తు ముమ్మరం

7 Jul, 2020 10:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: వ్యాపారి సురేష్‌ కిడ్నాప్‌ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్కయ్యపాలెం వ్యాపారి సురేష్‌, న్యాయవాది శర్మలను సోమవారం దుండగులు కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. దుండగులు కారులో సురేష్‌, శర్మలను ఊరంతా తిప్పుతూ కత్తులు, తుపాకితో బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో బాధితుడు సురేష్‌ తన‌ భార్యకు ఫొన్‌ చేసి నగలు తీసుకుని సీతంపేటకు రమ్మని చెప్పడంతో కొద్ది సమయానికి ఆమె నగలతో అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో సంఘటన స్థలంలోనే సురేష్‌కు అతడి భార్యకు మధ్య వాదన జరిగిందని పోలీసులు తెలిపారు. అప్పటికే సురేష్‌ కుమారుడు 100 ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫోన్‌కాల్‌ ఆధారంగా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అక్కడ పోలీసులను చూసిన దుండగులు సురేష్‌ను, న్యాయవాది శర్మను వదిలి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు వెంబడించగా కశీంకోట-యలమంచిలి మధ్య దుండగుల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ చెపట్టిన పోలీసులు సురేష్‌ కిడ్నాప్‌ వ్యవహారంలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. గతంలో కూడా వ్యాపారి సురేష్‌పైన 6 కేసులు నమోదయ్యాయని వాటిలో మూడు రైస్‌ పుల్లింగ్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సురేష్‌ కిడ్నాప్‌కు వ్యాపార లావాదేవీలే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అప్పుల నుంచి బయట పడటానికి కిడ్నాప్‌ డ్రామా ఆడారా అనే మరో కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

సురేష్ చుట్టూ పెరుగుతున్న అనుమానాలు 
డాబాగార్డెన్స్ వద్ద నివాసముంటున్న సురేష్  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భారీగా అప్పులపాలైయ్యాడు.  అప్పుల ఒత్తిడి తట్టుకోలేక పలుమార్లు భార్య బంగారం తాకట్టు పెట్టేందుకు ప్రయత్నంచగా భార్య అందుకు నిరాకరించింది. ఆమె బంగారం ఇవ్వకపోవడంతో కిడ్నాప్ డ్రామాకి తెరలేపారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు విచారణలో సురేష్‌ తనకి ఎటువంటి అప్పులు లేవని, రెండు కోట్ల అప్పు ఉన్నప్పటికీ తనకే 5 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని పోలీసులకు తెలిపాడు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్‌పై ఆరు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు