ఒక మరణం.. అనేక అనుమానాలు

18 Sep, 2019 04:32 IST|Sakshi

క్లూస్‌ టీం వెళ్లేటప్పటికే నేరస్థలంలో చెరిగిపోయిన కీలక ఆధారాలు

అల్పాహారం ముందు ‘కోడెల’ ఏం తీసుకున్నారు?

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికే కీలకం

సెల్‌ఫోనూ కనిపించడంలేదు

ఆత్మహత్యకు ముందు చివరి ఫోన్‌కాల్‌ 24 నిమిషాలు ఎవరితో మాట్లాడారు

కోడెల మరణం వెనుక కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసుల ఆరా

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన మరణాన్ని సైతం మభ్యపెట్టేందుకు సొంత మనుషులే ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఆయన ఉరి వేసుకుని చనిపోతే గుండెపోటు అని.. ప్రమాదకర ఇంజక్షన్లు చేసుకున్నారంటూ మీడియాకు పరస్పర విరుద్ధమైన లీకులు ఎందుకిచ్చారు? కొనఊపిరితో ఉన్న ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? పైగా దూరంగా ఉన్న బవసతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లినట్లు?.. నేర స్థలంలో ఆధారాలు ఎందుకు చెరిగిపోయాయి?.. కోడెల వాడుతున్న సెల్‌ఫోన్‌ ఏమైపోయింది?.. ఆత్మహత్యకు ముందు 24 నిమిషాలపాటు ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడారు?.. ఇవీ కోడెల ఆత్మహత్యపై ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. కానీ, ఆయన ఆత్మహత్యను ఏ కోణంలో చూసినా.. కోడెల కుమారుడు, కుమార్తె చర్యలు, వాడుకుని కష్టకాలంలో వదిలేసిన సొంత పార్టీ వ్యవహారశైలి వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయి.

కోడెల మృతిచెందిన రోజున అసలేం జరిగింది అనే కోణంలో తెలంగాణ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ముందుగా కుటుంబ సభ్యుల తీరుపైనే అనుమానం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో గడిచిన ఐదేళ్లలో కొడుకు శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి చేసిన వ్యవహారాలు తన పరువు తీశాయని ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు ప్రచారం జరుగుతోంది. పలు అంశాలపై కుమారుడు, కుమార్తెతో ఆయనకు తరచూ వాగ్వాదం జరిగేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న తనను పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరూ పట్టించుకోకపోగా, పలకరింపే కరువైనట్లు ఆయన తన ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు సమాచారం. 

 ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది?
కోడెల ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రధానంగా దృష్టిసారించారు. ఇప్పటికే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉ.9.30 గంటల వరకూ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? కుటుంబ సభ్యులతో ఏదైనా వాగ్వాదం జరిగిందా? అనేది కీలకంగా మారింది. అలాగే, కొద్దిరోజుల క్రితం గుండెపోటు వచ్చిందని కోడెలను నరసరావుపేటలోని తన అల్లుడు ఆసుపత్రికి తరలించారు. నిజానికి ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఉరి వేసుకుని చనిపోతే మళ్లీ అదే గుండెపోటు కథను ఎందుకు నడిపించారు.. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో అన్న దానిపై వారు దృష్టిపెట్టారు. 

క్లూస్‌ టీం కోణమేంటి?
కోడెల ఆత్మహత్య అనంతరం ఆయనను తొలుత బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతే క్లూస్‌ టీం ఘటన స్థలాన్ని సందర్శించింది. కానీ, అప్పటికే నేరస్థలంలో కీలక ఆధారాలు లభించలేదని క్లూస్‌ బృందం చెబుతున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు ఉపయోగించిన తాడు (గుడ్డతో చేసింది) ఘటన స్థలంలో కాకుండా వేరేచోట సేకరించినట్లు సమాచారం. ఉరి వేసుకున్నట్లుగా చెబుతున్న ఫ్యాన్‌ భాగం వంగి ఉంది. అయితే.. నేలభాగం, ఫ్యాను ఎత్తుని పోల్చిన క్లూస్‌ బృందం ఈ విషయంలో అనుమానం వ్యక్తంచేస్తోంది. కోడెల మంచం మీద నుంచి ఫ్యానుకు తాడు బిగించుకున్నారా? అదే నిజమైతే ఫ్యాన్‌ ఇంకా ఎక్కువగా వంగి ఉండాలని అంటున్నారు. అలాకాకుండా ఏదైనా స్టూల్‌ లేదా కుర్చి వేసుకున్నారా? అని సందేహిస్తున్నారు. కానీ, దీనికి బలం చేకూర్చే ఆనవాళ్లేమీ అక్కడ కన్పించలేదని క్లూస్‌ అధికారులు అంటున్నారు. ఇక కోడెల గదిలో ఎలాంటి లేఖ కన్పించలేదు. ఏదేమైనా ఫోరెన్సిక్‌ లేబొరేటరీ పరీక్షల ఆధారంగానే కోడెల మృతిపై నెలకొన్న సందేహాలు నివృత్తి అయ్యే వీలుందని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి.  కోడెల మృతదేహాన్ని ఆయన కుటుంబీకులు మంగళవారం ఉదయం స్వస్థలానికి తరలించారు. అలాగే, హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నుల్ని ఆరా తీశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పరిశీలించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. 

ఆధారాలేమయ్యాయి?
కోడెలది ఆత్మహత్యేనని శవపరీక్షలో ప్రాథమికంగా నిర్థారించినా, భిన్న కోణాల్లో వస్తున్న అనుమానాలపైనే దర్యాప్తు బృందాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఫోరెన్సిక్‌ పరీక్షల అనంతరమే వాస్తవ పరిస్థితిపై పూర్తి అవగాహనకు రావడం సాధ్యమని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. క్లూస్‌ టీం వెళ్లే సమయానికే నేరస్థలం పూర్తిగా చెరిగిపోవడాన్ని గమనించిన అధికారులు కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించలేకపోయారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, క్లూస్‌ టీం.. శవ కాఠిన్యత విషయంలోనూ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి ఆయన మృతిపై కచ్చితమైన సమయాన్ని రికార్డు చేయడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని అధికారులు అంటున్నారు. 

ఆ ద్రవాలు ఏమిటి?
భౌతిక ఆధారాలను బట్టి పోస్టుమార్టం వైద్యుడు ఆత్మహత్య అనే నిర్థారణకు వస్తారు. కానీ, విస్రా (కాలేయం, పేగులు, గుండె, మూత్ర పిండాలు)ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కచ్చితమైన ఆధారాలు లభిస్తాయి. విస్రాను ఫోరెన్సిక్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) టాక్సికాలజీ (విష పదార్థాల పరీక్ష) విభాగం పరిశీలించాల్సి ఉంటుంది. పోస్టుమార్టం చేసి, విస్రాను సేకరించిన వైద్యులు అల్పహారంతో పాటు, కొన్ని ద్రవాలు ఉన్నట్లు గుర్తించారని సమాచారం. దీన్నిబట్టి కోడెల అంతకుముందు ఏదైనా ద్రవ పదార్థం తీసుకున్నారా? తీసుకుంటే అదేంటి? అదేమైనా విషపూరితమైనదా? ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యుల మధ్యే ఉన్నందున దాన్నెలా తీసుకున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

కోడెల ఫోన్‌ ఎక్కడ?
కోడెల ఆత్మహత్యకు దారితీసిన కీలక ఆధారాలు తెలుసుకోవడంలో పోలీసులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌ వ్యవహారం జఠిలంగా మారింది. చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? అన్నది తేలడానికి కోడెల సెల్‌ఫోన్‌ ఒక్కటే ఆధారం. కానీ, అదిప్పుడు కనిపించడంలేదు. కుటుంబ సభ్యుల వద్ద ఉండి ఉంటుందని.. అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యాక స్వాధీనం చేసుకుంటామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు.. కోడెల కాల్‌డేటాను దర్యాప్తు అధికారులు వెలికితీస్తున్నారు. చనిపోవడానికి ముందు ఆయన 24 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడినట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎవరితో అనేది తెలియాల్సి ఉందన్నారు. వాట్సాప్‌ అకౌంట్‌ విశ్లేషణకూ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోడెల చివరిసారిగా సోమవారం ఉ.6.51 గంటలకు వాట్సాప్‌ను చూసినట్లు.. అలాగే, ట్రూకాలర్‌ను ఆదివారం చూసినట్లు అధికారులు గుర్తించారు. 

ఆవేశంలోనే ఆత్మహత్య?
సాధారణంగా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే కారణాలను వివరిస్తూ సూసైడ్‌ నోట్‌ రాస్తారని.. కానీ, కోడెల ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అంటే అప్పటికప్పుడు మాట్లాడిన ఫోన్‌కాల్‌ కారణంగానో, కుటుంబ సభ్యుల వివాదంతోనో ఆవేశంగా ఆయన ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఆ అధికారి విశ్లేషించారు. 

మరిన్ని వార్తలు