ఇక అలా చేస్తే రెడ్‌ కార్డులు..

27 Jun, 2019 08:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు, యువతులను బహిరంగ ప్రదేశాల్లో కామెంట్‌ చేయడం,లైంగికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడే వారిని హెచ్చరించేలా రెడ్‌ కార్డులు జారీ చేయాలని నోయిడా పోలీసులు నిర్ణయించారు. యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను పరిపుష్టం చేయడంతో పాటు మహిళలను వీధుల్లో వేధింపులకు గురిచేసే వారికి చెక్‌ పెట్టేలా పోలీసులు వినూత్య చర్యలు చేపట్టారు.

మహిళలను వేధిస్తున్న వారిని గుర్తించి రెడ్‌ కార్డులు జారీ చేస్తామని. వారు మరోసారి ఈ చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరించారు. రెడ్‌ కార్డులు అందుకున్న వారి పేరు, చిరునామా, కాంటాక్ట్‌ నెంబర్లను రిజిస్టర్‌లో నమోదు చేసి రికార్డు నిర్వహిస్తామని చెప్పారు. మహిళల భద్రతకు ఆటంకం కలిగించే వారిని రెడ్‌ కార్డు నిలువరించేలా చర్యలు చేపడతామని ఢిల్లీ రూరల్‌ (గౌతమ్‌ బుధ్‌ నగర్‌) ఎస్పీ వినీత్‌ జైస్వాల్‌ తెలిపారు.

మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం, వారిని వెంబడించడం, వారిపై నేరాలకు పాల్పడే వారిని జైలుకు పంపేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు మహిళలపై వేధింపులను నివారించేందుకు అవసరమైన చర్యలపై సూచనలు స్వీకరించేందుకు స్కూళ్లు, కాలేజీలకు ఫీడ్‌బ్యాక్‌ ఫారాలను పంపుతామని చెప్పారు.

మరిన్ని వార్తలు