ఏదీ పురోగతి?

13 Aug, 2018 12:11 IST|Sakshi
సాయినగర్‌లో స్టేట్‌ బ్యాంకులో చోరీ చేస్తున్న దొంగలు (సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు)

అటకెక్కిన సాయినగర్‌ ఎస్‌బీఐలో చోరీ కేసు దర్యాప్తు

ఆరు నెలలు గడిచినా ఎటువంటి క్లూనూ సంపాదించని పోలీసులు

15 రోజుల్లోనే జేఎన్‌టీయూ స్టేట్‌ బ్యాంకు దోపిడీ కేసు ఛేదింపు

మెయిన్‌బ్రాంచి కేసును సీరియస్‌గా పరిగణించని ఉన్నతాధికారులు

అనంతపురంలోని సాయినగర్‌ ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచిలో ఖాతాదారుడి వద్ద నుంచి నగదు అపహరించిన కేసు దర్యాప్తు అటకెక్కింది. ఆరు నెలలు గడిచినాదర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. జేఎన్‌టీయూ ఎస్‌బీఐ బ్రాంచిలో లాకర్‌ తెరిచి రూ.39లక్షలు దోచుకుని వెళ్లిన కేసును 15 రోజుల్లో ఛేదించిన పోలీసులు... మెయిన్‌ బ్రాంచి చోరీ నిందితులను గుర్తించడంలో విఫలమయ్యారు.దర్యాప్తును పూర్తిగా అటకెక్కించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనంతపురం సెంట్రల్‌: అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపానున్న డీఎస్‌పీ రెడ్డి భారత్‌గ్యాస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న తలారి బాలరాజు ఫిబ్రవరి 12న గ్యాస్‌ ఏజెన్సీ డబ్బులను ఖాతాలో జమ చేసేందుకని ఎస్‌బీఐ సాయినగర్‌ మెయిన్‌బ్రాంచ్‌కు వెళ్లాడు. రూ. 5.15 లక్షల నగదుతో క్యూలో నిల్చొని ఉన్నాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన నలుగురు దొంగలు చాకచక్యంగా బాలరాజు వద్దనున్న నగదు బ్యాగును అపహరించుకుపోయారు. క్షణాల్లోనే బాధితుడు బ్యాంకు అధికారులను, పోలీసులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే బ్యాంకు నుంచి దొంగలు ఉడాయించినట్లు సీసీ కెమెరాల ద్వారా తేలింది.

దర్యాప్తులో వేగం లేదు..
తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు చాలెంజింగ్‌గా తీసుకొని దర్యాప్తు చేసే పోలీసులు సాయినగర్‌ స్టేట్‌బ్యాంకు చోరీ కేసుపై పెద్దగా దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించారు. అయినప్పటికీ వారెవరనేది గుర్తించలేకపోయారు. ఎంతటి పెద్ద నేరంలోనైనా నిందితులు ఇసుమంత క్లూ అయినా వదిలేసి పోయి ఉంటారని భావిస్తారు. జేఎన్‌టీయూ స్టేట్‌బ్యాంకు లాకర్‌లో నగదు దోపిడీ కేసులో కూడా ఇది నిరూపితమైంది. ఇనుప కడ్డీలను తొలగించేందుకు తెచ్చుకున్న గ్యాస్‌కట్టర్, సిలిండర్‌లను దుండగులు అక్కడే వదిలేసిపోయారు. ఎక్కడి నుంచి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ అయిందని ఆరా తీస్తే బెంగుళూరులో తీసుకున్నట్లు తేలింది. అక్కడ నగదును ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో అకౌంట్‌ ఖాతా ఆధారంగా నిందితులను గుర్తించారు. హర్యానాకు చెందిన ప్రొఫెషనల్‌ ముఠాను 15 రోజుల్లోగా పట్టుకోగలిగారు. మరి సాయినగర్‌ స్టేట్‌బ్యాంకు చోరీ కేసును మాత్రం పోలీసులు ఈ స్థాయిలో చాలెంజింగ్‌గా తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస దర్యాప్తు కూడా చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

త్వరలో పట్టుకుంటాం
సాయినగర్‌ స్టేట్‌బ్యాంకు చోరీ కేసులో నిందితులను హోజికుప్పం ముఠా సభ్యులుగా గుర్తించాం. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపాం. అయితే వారి ఆచూకీ దొరకలేదు. నిందితుల కోసం వేట కొనసాగుతోంది. కచ్చితంగా నిందితులను పట్టుకుంటాం.  – జె.వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం

మరిన్ని వార్తలు