శిక్షించండి లేదా..క్షమించండి!

24 Jul, 2018 11:33 IST|Sakshi

మెమోలు ఇచ్చిన విషయం గుర్తించండి

వాటితో పదోన్నతుల ప్రక్రియకు ఆటంకం

గగ్గోలు పెడుతున్న ‘నయీం కేసు’ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ జరిగి రెండేళ్లు కావస్తోంది... అతడితో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పలువురు పోలీసులకు తాఖీదులు జారీ చేసి ఏడాదిన్నర దాటింది... దీనికి వారు సమాధానం ఇచ్చి సంవత్సరం కావస్తోంది... అయినా ఇప్పటికీ దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సస్పెన్షన్‌కు గురైన వారిపై చర్యలు ఉపసంహరించిన అధికారులు తాఖీదుల విషయం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చార్జ్‌మెమోలపై నిర్ణయం తీసుకోకుంటే అది తమ పదోన్నతుల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు.

అనేక మందికి చార్జ్‌మెమోలు...
నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత అతడి వ్యవహారాలను దర్యాప్తు చేయడం కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) లోతుగా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో పలువురు బడాబాబుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. వీరితో పాటు అనేక మంది పోలీసుల పైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరికి నయీంతో ఉన్న సంబంధాలపై పక్కా ఆధారాలు లభించగా.. మరికొందరు అతడితో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఐదుగురిని సస్పెండ్‌ చేయడంతో పాటు మరో 20 మందిపై విచారణ నిర్వహించారు. వీరిలో 16 మందికి నయీంతో ఉన్న సంబంధాలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ చార్జ్‌మెమోలు జారీ చేశారు.

సమాధానాన్ని పట్టించుకోలేదు...
చార్జ్‌మెమోలు అందుకున్న వారిలో డీఎస్పీలతో పాటు ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. వీరంతా ఆరు నెలల్లోపే వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేసిన నయీంతో విధి నిర్వహణలో భాగంగానే సంబంధాలు కొనసాగించామని, ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారమే వ్యవహరించినట్లు కొందరు పేర్కొన్నారు. మరికొందరు అధికారులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అతడితో ఎలాంటి సంబంధాలు లేవని, అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఫంక్షన్స్‌లో అతడు కలిశాడంటూ వివరణ ఇచ్చుకున్నారు. దాదాపు ప్రతి అధికారీ అతడితో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని, సెటిల్‌మెంట్లతో సంబంధాలు లేకపోవడమే కాదు అప్పట్లో ఈ వివరాలు తమకు తెలియవని చెప్పారు.

పట్టించుకోని ఉన్నతాధికారులు...
నయీంతో సంబంధాల ఆరోపణలపై సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరిపై ఇటీవల చర్యలు ఉపసంహరించారు. చార్జ్‌మెమోలు అందుకున్న అధికారులు వివరణలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సాధారణంగా పోలీసులపై తీవ్రస్థాయి ఆరోపణలు వస్తే వారికి చార్జ్‌మెమో జారీ చేస్తారు. సదరు అధికారి ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరణతో సంతృప్తి చెందితే చార్జ్‌మెమో ఉపసంహరించడం, లేదా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే నయీం కేసులో చార్జ్‌మెమోలు అందుకున్న వారు ఇచ్చిన వివరణల్ని అధికారులు పట్టించుకోవట్లేదు. సాధారణంగా వివరణ ఇచ్చిన మూడు నెలల్లో ఏదో ఒక చర్య తీసుకోవాల్సి ఉన్నా... డీజీపీ కార్యాలయంతో పాటు నగర పోలీసు కార్యాలయం ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు.

పదోన్నతి ప్రక్రియకు అడ్డంకిగా...
పోలీసు విభాగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం పదోన్నతి ఓ ప్రహసనం. ఓ అధికారికి ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి చార్జ్‌మెమోలు అడ్డంకిగా మారితే ప్రక్రియకు బ్రేక్‌ పడుతుంది. ఆ తర్వాత ఆ మెమో డ్రాప్‌ చేసినా.. మళ్లీ పదోన్నతి ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎన్నాళ్లకు సాకారమవుతుంతో చెప్పలేని స్థితి. ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ పదోన్నతి కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబితాలో చార్జిమెమోలు అందుకున్న వారుసైతం ఉన్నారు. వారి వివరణలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ప్రమోషన్‌కు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చిన సమాధానాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయా అధికారులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా