రౌడీ పెళ్లికి పోలీసులే రక్ష

5 Jul, 2018 09:13 IST|Sakshi
రౌడీషీటర్‌ శివకుమార్‌

డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ హోదాలో బందోబస్తు

ముక్కున వేలేసుకుంటున్న ప్రజానికం

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై మహానగరంలో అదో అతిపెద్ద కల్యాణ మండపం. అంగరంగ వైభవంగా సాగుతున్న వివాహవేడుకకు హాజరైన సినీజనులు, రాజకీయ ఘనులతో సందడే సందడి. ఇంతటి కోలాహలంగా సాగుతున్న వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందబస్తుగా ఎటుచూసినా పోలీసులు. పోలీసు వలయంలో సాగుతున్న ఈ వివాహ వేడుక ఏదో మంత్రి పుంగవుడికి సంబంధించిన వారిది అనుకుంటున్నారా. అదేం కాదు. ఘోరమైన నేరచరిత్ర కలిగిన ఒక ఘరానారౌడీ పెళ్లి సంబరం. ఈ పెళ్లి సజావుగా సాగేలా కాపుకాసింది పోలీసు పెద్దలే. వివరాల్లోకి వెళితే...

చెన్నై మైలాపూరుకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్‌ శివకుమార్‌ (40), మైలాపూరులో గతంలో జరిగిన జంట హత్యల కేసు, కాంచీపురంలో జిల్లాలో జరిగిన మరో హత్యకేసు సహా పలునేరాల్లో నిందితుడు. సుమారు ఆరునెలల క్రితం రౌడీ బిను తన జన్మదినాన్ని చెన్నై శివార్లలో పెద్దఎత్తున రహస్యంగా నిర్వహించి నగరంలోని రౌడీలను ఆహ్వానించాడు. చెన్నై శివారు మాంగాడులో జరిగిన ఈ వేడుకల్లో రౌడీ బిను ఒక వేట కొడవలితో కేక్‌ను కట్‌చేసి జన్మదిన సంబరాలు చేయడం, పోలీసులు మెరుపుదాడి చేసి కొందరు రౌడీలను అరెస్ట్‌ చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఈ సంబరానికి రౌడీ శివకుమార్‌ కూడా హాజరయ్యాడు. ఇదిలా ఉండగా, రౌడీ శివకుమార్‌ ఈనెల తన వివాహాన్ని చెన్నై శాంథోమ్‌లోని ఒక కల్యాణమండపంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు.

ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖలతోపాటు సుమారు వంద మందికి పైగా రౌడీలు కూడా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. మైలాపూర్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం అంతకంటే ఆశ్చర్యకరంగా మారింది. దీనిపై ఒక పోలీసు ఉన్నతాధికారి వివరణ ఇస్తూ, రౌడీ శివకుమార్‌ ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్థుడు, అయితే నాలుగేళ్లగా పెద్దస్థాయిలో నేరా లకు పాల్పడడం లేదు. అప్పుడప్పుడూ ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్‌ చేస్తూనే ఉన్నాం. మైలాపూరు జంట హత్యకేసుల నుంచి అతనికి విముక్తి లభించింది. మిగతా కేసులను కోర్టులో ఎదుర్కొంటున్నాడు. ప్రత్యేకమైన తీరులో శివకుమార్‌ తన పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే, అతని శతృవులు కల్యాణమండపంలోకి చొరబడి దాడులకు పాల్పడుతారనే అనుమానంతో బందోబస్తు పెట్టాం. అంతేగాక రౌడీ పెళ్లికి ఎవరెవరు వచ్చి వెళుతున్నారని తెలుసుకునే అవకాశం కూడా మాకు లభించింది. ఒక రౌడీ పెళ్లికి భారీ పోలీసు బందోబస్తు పెట్టడం ప్రజల్లోనేకాదు పోలీస్‌శాఖలోనే చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు