30 మంది గుట్టురట్టు

26 Dec, 2019 10:33 IST|Sakshi

చిక్కిన 24 మంది అడ్రస్సు అరెస్టుకు నిర్ణయం

సాక్షి, చెన్నై: అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న చెన్నైలోకి 30 మంది గుట్టును రట్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వీరిలో 24 మంది అడ్రస్సులను గుర్తించారు. వీరిని అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అ ధికారి జయలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. హైదరాబాద్‌లో దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలకు రక్షణను మరింత  మెరుగు పరిచే విధంగా రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ అశ్లీల వీడియోలను వీక్షించే వారిని, వాటిని డౌన్‌లోడ్‌ చేసే వారు, షేరింగ్‌ చేసే వాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న మూడు వేల మందిని రాష్ట్రవ్యాప్తంగా గుర్తించారు. వీరికి హెచ్చరికలు ఇచ్చారు. అలాగే, పదే పదే తమకు పట్టుబడితే ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఈ పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్‌ అల్ఫోన్స్‌ రాజా(40) ఆదవన్‌....ఆదవన్‌ పేరిట ఓ మెసెంజర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని అశ్లీల వీడియోల్ని ఇష్టానుసారంగా షేర్‌ చేస్తూ రావడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన తొలి వ్యక్తి రాజా. ఈ పరిస్థితుల్లో హెచ్చరికలు చేసినా, ఖాతరు చేయకుండా అశ్లీల వీడియోలను వీక్షిస్తూ వస్తున్న వారిలో చెన్నైకు చెందిన 30 మంది భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురి సెల్‌ఫోన్‌ ఐపీ అడ్రస్సును సేకరించారు. ఆ సెల్‌ నంబర్ల ఆధారంగా చిరునామాల్ని సేకరించారు. 24 మంది అడ్రస్సులను గుర్తించారు. మిగిలిన ఆరుగురు చెన్నై చిరునామా ఇచ్చినా,  ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్టు తేల్చారు. దీంతో మిగిలిన వారిని అరెస్టు చేయడానికి మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం అధికారి జయలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో వీరిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టే దిశగా ఆ విభాగంలోని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 

మరిన్ని వార్తలు