హరియాణా గ్యాంగ్‌రేప్‌పై ‘సిట్‌’

16 Sep, 2018 03:20 IST|Sakshi
నిందితులు మనీశ్, నిషు, పంకజ్‌

నిందితుల ఆచూకీ చెబితే రూ.లక్ష నజరానా

చండీగఢ్‌/న్యూఢిల్లీ: హరియాణాలో సీబీఎస్‌ఈ టాపర్‌గా నిలిచిన యువతి(19)పై సామూహిక అత్యాచారం చేసినవారిలో ఓ ఆర్మీ జవాను కూడా ఉన్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ బీఎస్‌ సంధూ తెలిపారు. బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డ దుండగులు ఇంకా పరారీలోనే ఉన్నారని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు నూహ్‌ ఎస్పీ నజ్నీన్‌ భాసిన్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశామన్నారు.

బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆర్మీ జవాన్‌ పంకజ్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఓ బృందాన్ని రాజస్తాన్‌లోని కోటకు పంపామని సంధూ పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామనీ, పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష నజరానాగా అందజేస్తామని ప్రకటించారు. వైద్య పరీక్షల్లో యువతిపై లైంగికదాడి జరిగినట్లు తేలిందన్నారు. కాగా, జవాన్‌ పంకజ్‌ విషయంలో పోలీసులకు సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది.

మరోవైపు ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌డబ్ల్యూసీ).. వీలైనంత త్వరగా దీనిపై నివేదికను సమర్పించాలని హరియాణా డీజీపీ సంధూను ఆదేశించింది. కనియా జిల్లాలో కోచింగ్‌ క్లాస్‌కు వెళ్లి తిరిగివస్తున్న ఓ యువతిని బుధవారం ముగ్గురు యువకులు కిడ్నాప్‌చేసి గ్యాంగ్‌రేప్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 9 మంది బాధితురాలిపై లైంగికదాడికి దిగారు. ఆమె స్పృహ కోల్పోవడంతో బస్టాండ్‌లో పడేసి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు