‘నయవంచనకు గురయ్యాను.. అందుకే’

13 Sep, 2018 11:44 IST|Sakshi
బిన్ని శర్మ (ఫైల్‌ ఫొటో)

సూసైడ్‌ నోట్‌ రాసి ఉరివేసుకున్న ఐఆర్‌ఎస్‌ అధికారిణి

జైపూర్‌ : ఓవైపు మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలు పెట్టే భర్త... మరోవైపు భర్త ఎలాంటి వాడైనా సరే అతడితో కలిసి జీవించాల్సిందేనన్న తల్లిదండ్రుల ఆంక్షల మధ్య నైరాశ్యానికి లోనైన ఓ ఇండియన్‌ రెవెన్యూ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నెలలో చోటు చేసుకున్న ఈ విషాదరకర ఘటనకు సంబంధించిన కారణాలు  పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌, వ్యక్తిగత డైరీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

వివరాలు... రాజస్థాన్‌కు చెందిన బిన్ని శర్మ భారత రెవెన్యూ అధికారిణిగా పనిచేసేవారు. ఎనిమిదేళ్ల క్రితం వ్యాపారవేత్త గుర్మీత్‌ వాలియాతో ఆమె వివాహం జరిగింది. అయితే డబ్బు మీద వ్యామోహం ఉన్న గుర్మీత్‌.. బిన్నిని నిరంతరం వేధిస్తూ ఉండేవాడు. ఆర్థికంగా ఇంకా బలపడాల్సిన అవసరం ఉందంటూ మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. అంతేకాకుండా గుర్మీత్‌ తమ ఇంట్లో పనిచేసే అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు కూడా బిన్నీ కంటపడ్డాయి. దీంతో తాను నయవంచనకు గురయ్యానని, అన్ని విధాలుగా నష్టపోయాయని బిన్నీ బాధపడేది. ఈ క్రమంలో భర్తతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి విడాకులు తీసుకుంటానని కోరింది. కానీ అందుకు వారు ఒప్పుకోకపోవడంతో నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలోనే గత నెల 7న ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే బిన్నీ మరణించిన తర్వాత అల్లుడి గురించి నిజాలు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిన్నీ పిల్లలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.

కాగా బిన్ని శర్మ మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదని.. ఈ కారణంగా తన క్లైంట్‌ ఎంతో వేదనకు గురయ్యాడని గుర్మీత్‌ తరపు న్యాయవాది పేర్కొన్నాడు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక గుర్మీత్‌పై బిన్ని తల్లిదండ్రులు కేసు పెట్టారని ఆరోపించాడు.

మరిన్ని వార్తలు