బెల్టుషాపులపై ఉక్కుపాదం

24 Jun, 2018 13:17 IST|Sakshi
చౌదర్‌పల్లిలో అరెస్టయిన మద్యం వ్యాపారి

యాచారం : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌శాఖ గ్రామాల్లో ప్రశాంతత కోసం ముందు జాగ్రత్తలకు శ్రీకారం చుట్టింది. ప్రజలు  విచ్చలవిడిగా మద్యం తాగడం వల్లే  ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణంకు దారి తీస్తుందని అంచనాకు వచ్చిన పోలీస్‌ శాఖ కఠిన చర్యలకు పూనుకుంది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో మద్యం బాటిల్‌ కానీ, నాటు సారాయి కానీ దొరక్కుండా కట్టడి చర్యలకు ఉపక్రమించింది.  పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా మేజర్‌ గ్రామ పంచాయతీలైన నక్కర్తమేడిపల్లి, యాచారం, గునుగల్, నందివనపర్తి, మాల్, చింతపట్ల తదితర గ్రామాల్లోని ఆశావహులు నిత్యం దావత్‌లు ఇస్తుండడంతో  తాగుబోతుల వీరంగం అంతా ఇంతా కాదు. మాల్, గునుగల్, యాచారం కేంద్రాల్లో ఉన్న వైన్స్‌ దుకాణాల నుంచి నిత్యం ఆయా గ్రామాల్లోని బెల్టు దుకాణాల వ్యాపారులు వేలాది రూపాయలు విలువ జేసే మద్యాన్ని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. స్థానికంగానే మద్యం దొరకడం వల్ల మందుబాబులు అర్థరాత్రి వరకు తాగుతూ గ్రామాల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. గ్రామాల్లో ఏ క్షాణాన ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయాందోళన నెలకొంది.

బెల్టు దుకాణాలపై ఏకకాలంలో దాడులు 
మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో దాదాపు 150కి పైగానే బెల్టు దుకాణాలున్నట్లు పోలీస్‌ శాఖ అంచనాకు వచ్చింది. ఆయా గ్రామాల్లో ఏ బెల్టు దుకాణం దారుడు మద్యం విక్రయాలు జరుపుతారనే సమాచారాన్ని ఇన్‌ఫార్మర్ల ద్వారా సేకరించిన పోలీసులు ఏక కాల దాడులకు నిర్ణయించారు. పక్షం రోజుల వ్యవధిలోనే మద్యం విక్రయాలు జరుపుతున్నందుకు గాను ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. సీఐ లిక్కి కృష్ణంరాజు పర్యవేక్షణలో ఎస్సైలు వెంకటయ్య, సురేష్, 30 మందికి పైగా పోలీస్‌ సిబ్బంది గ్రామాల్లో ఉన్న బెల్టు దుకాణాలపై ఏక కాలంలో దాడులు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే నక్కర్తమేడిపల్లి, మల్కీజ్‌గూడ, నానక్‌నగర్, చింతుల్ల, గునుగల్, చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లోని బెల్లు దుకాణాలపై దాడులు చేసి వ్యాపారులను గట్టిగా హెచ్చరించారు.

20 మందికి పైగా వ్యాపారులను అదుపులోకి తీసుకుని మళ్లీ మద్యం బాటిల్‌ విక్రయించినా కేసు నమోదు చేసి ఆరు నెలలు జైలుకు పంపిస్తామని పేర్లు నమోదు చేసుకుని వదిలేశారు. యాచారం, మాల్, గునుగల్‌ కేంద్రాల్లో ఉన్న వైన్స్‌ వ్యాపారులను కూడా కలిసి బెల్టు దుకాణాల వ్యాపారులకు మద్యం విక్రయించరాదని, విక్రయాలు జరిపితే మీపైన కూడా కేసులు నమోదు చేయడంతో పాటు వైన్స్‌ షాపులు సీజ్‌ చేస్తామని హెచ్చరికలు చేశారు. ఏకకాల దాడుల వల్ల గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం కనిపిస్తుంది. ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

పోలీస్‌ చర్యలు అభినందనీయం  
గ్రామాల్లో బెల్టు దుకాణాలపై పోలీసులు ఏక కాలంలో దాడులు చేయడం వల్ల  గ్రామాల్లో మద్యం విక్రయాలు తగ్గాయి. ఎన్నికల నేపథ్యంలో ఏ గ్రామంలో చూసినా మందుబాబుల వీరంగం ఉంది. సర్పంచ్‌లుగా పోటీ చేసే ఆశావహులు నిత్యం రూ. వేలల్లో ఖర్చు చేసి అప్పులపాలైనారు. మద్యం కట్టడికి పోలీస్‌ శాఖ చర్యలు అభినందనీయం.
– తలారి మల్లేష్, తక్కళ్లపల్లి

మద్యం అమ్మితే ఫిర్యాదు చేయండి 
మండలంలోని 24 గ్రా మ పంచాయతీల్లో బెల్టు దుకాణాల వ్యాపారులు మద్యం విక్రయాలు జ రిపితే 94906 17313 ఫోను నంబరుకు ఫిర్యా దు చేయాలి. వెంటనే ఆ దుకాణంపై దాడులు చేసి వ్యాపారితో పాటు వైన్స్‌ యజమానిపై కూడా కేసులు నమోదు చేస్తాం. మద్యం వల్ల గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం లేకుండా పోతుందనే ఏక కాల దాడులకు దిగాం.
– లిక్కి కృష్ణంరాజు, సీఐ యాచారం

మరిన్ని వార్తలు