పరిటాల శ్రీరామ్‌కు చేరవేస్తున్న నగదు సీజ్‌

3 Apr, 2019 08:26 IST|Sakshi

మియాపూర్‌ నుంచి రాప్తాడు తరలించేందుకు ప్రయత్నం

తెలంగాణ పోలీసుల అదుపులో పరిటాల శ్రీరామ్‌ అనుచరుడి డ్రైవర్‌ సంతోష్‌ రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి పరిటాల సునీత కుమారుడు, అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు చేర వేసేందుకు సిద్ధం చేసిన రూ.24 లక్షలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడి ప్రధాన అనుచరుడు తన డ్రైవర్‌ ద్వారా నగదు పంపేందుకు ప్రయత్నించారు. నగదు చిక్కిన విషయం తెలియడంతో టీడీపీ కీలక నేతలు, ఏపీ ప్రభుత్వ అధికారులు సైబరాబాద్‌ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు  ఎన్నికల అధికారులు, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. రాప్తాడు మండల పరిషత్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా (ఎంపీపీ) ఉన్న దగ్గుపాటి వెంకట ప్రసాద్‌ పటాన్‌చెరులో డీవీ పాలిమర్స్‌ పేరుతో ఓ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. 

రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌కు  రూ.24 లక్షలు సమకూర్చడానికి సిద్ధమైన ప్రసాద్‌ ఈ మొత్తాన్ని పోలీసుల కంటపడకుండా తరలించడానికి పథకం వేశారు. వ్యక్తిగత వాహనాల్లో తీసుకువెళ్తే చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరిగితే పట్టుబడే ప్రమాదం ఉందని భావించి తన డ్రైవర్‌ సంతోష్‌రెడ్డికి డబ్బు అందించాడు. ఓ టావెల్స్‌ బస్సులో డబ్బు తరలిస్తున్న సంతోష్‌రెడ్డిని పోలీసులు సోమవారం  ఆరామ్‌ఘర్‌ చౌరస్తా ప్రాంతంలో తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఈ డబ్బుకి సంబంధించి ఆయన వద్ద ఎలాంటి రసీదులు, లెక్కలు లేకపోవడంతో పోలీసు స్టేషన్‌కు తరలించారు. తన యజమాని ప్రసాద్‌ సూచన మేరకే డబ్బులు తరలిస్తున్నట్లు సంతోష్‌రెడ్డి అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. 

గెలుపు కోసం మాజీ మంత్రి పల్లె అడ్డదారులు
అనంతపురం : మరోవైపు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా తన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టపర్తిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. నియోజకవర్గంలోని యువతను ఆకర్షించే ఎత్తుగడలో భాగంగా భారీగా క్రికెట్‌ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రీడా పరికరాల పంపిణీకి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. 

మరిన్ని వార్తలు