ఎస్‌ఐ భార్య పర్సు చోరీ

23 Jan, 2019 13:18 IST|Sakshi

బనశంకరీ ఆలయంలో ఘటన   

కర్ణాటక, బనశంకరి: ఆలయ దర్శనానికి వెళ్లిన ఎస్‌ఐ సతీమణికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలో బనశంకరీ దేవి దర్శనానికి వెళ్లిన ఎస్‌ఐ భార్య పర్సును గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన కుమారస్వామి లేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు... విశ్వేశ్వరపురం ట్రాఫిక్‌ ఎస్‌ఐ డీ.రమేశ్‌ సతీమణి హెచ్‌.గీత నలుగురు పోలీస్‌ అధికారుల భార్యలతో కలిసి సోమవారం సాయంత్రం బనశంకరీదేవీ దేవస్థానానికి వెళ్లారు. అందరూ క్యూలో వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. ఇంతలో గీతా బ్యాగ్‌లో ఉన్న పర్సు మాయమైంది. అందులో 12 గ్రాముల బంగారు కమ్మలు, 8 గ్రాముల బరువుగల చైన్, బంగారు డాలర్, ఆధార్‌కార్డు, ఓటరు కార్డు తదితర పత్రాలు ఉన్నాయి. 

ఖాళీ పర్సే దొరికింది  
కంగుతిన్న బాధితురాలు కుమారస్వామి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బనశంకరీ దేవస్ధానంలో పరిశీలించారు. మహిళా శౌచాలయంలో పనిచేసే మహిళా సిబ్బందికి పర్సు లభించడంతో పోలీసులకు అప్పగించారు. అయితే అది ఖాళీగా ఉంది. దొంగలు మొత్తం ఊడ్చుకుని ఖాళీ పర్సను పడేసి వెళ్లారు. 

మహిళా దొంగల పనేనా  
మహిళా దొంగలే చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయంలో తరచూ భక్తుల నగలు, పర్సులు చోరీ అవుతున్నాయి. కుమారస్వామి లేఔట్‌ పోలీస్‌ స్టేషన్‌ మహిళా పోలీస్‌ సిబ్బంది భక్తుల మాదిరిగా దేవస్థానంలో మకాం వేసి భద్రత కల్పిస్తున్నారు. కానీ చోరీలు మాత్రం జరిగిపోతున్నాయని భక్తులు వాపోతున్నారు. దేవస్ధానం వద్ద సీసీ కెమెరాలు లేని స్ధలాల్లో మాత్రమే చోరీలు జరుగుతున్నాయి. భక్తులు ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు అమర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు