భర్తే హంతకుడు

18 Jan, 2020 10:01 IST|Sakshi
నిందితుడిని అరెస్టు చేసి వివరాలు వెల్లడిస్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్, రూరల్‌ సీఐ శ్రీనివాసరావు(ఇన్‌సెట్‌లో) నిందితుడు ఉదయకుమార్‌ రాజు కుటుంబం (ఫైల్‌)

వీడిన 21 నెలల హత్య మిస్టరీ 

ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ 

ఏలూరు టౌన్‌: ఏలూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఓ.దిలీప్‌కిరణ్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయనతోపాటు రూరల్‌ సీఐ ఏ.శ్రీనివాసరావు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఘంటసాల ఉదయకుమార్‌ రాజుకు, కృష్ణాజిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి చెందిన ఘంటసాల చంటితో 2013లో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త ఉదయకుమార్‌ రాజు వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇరువురికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో 2018 మార్చి 30న అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఉదయకుమార్‌ రాజు తన భార్య చంటిని రాడ్డుతో తలపై బలంగా కొట్టటంతో ఆమె చనిపోయింది. అప్పట్లో మృతురాలి తండ్రి మోరు రామకృష్ణ పెదపాడు పోలీసులకు తన కుమార్తె ప్రమాదవశాత్తు చనిపోలేదనీ, అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు చేయకుండా ఫైలు పక్కనబెట్టేశారు.

మిస్టరీ వెలుగులోకి..
పెదపాడు పోలీసు స్టేషన్‌లో పాత కేసులను పరిశీలిస్తున్న ఏలూరు రూరల్‌ సీఐ శ్రీనివాసరావుకు ఈ అనుమానాస్పద మృతికేసు ఫైలు కనిపించింది. దీంతో మృతురాలు చంటి హత్య వెనుక అసలు మిస్టరీ బయటపడింది. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఆమె రాసినట్లు ఒక ఉత్తరాన్ని భర్త ఉదయకుమార్‌ రాజు రాశాడు. మెడకు తాడు బిగించి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చూపించాలని ప్రయత్నించాడు. కానీ ఆమె చెవిలో నుంచి రక్తం కారుతూ ఉండడంతో మళ్లీ మృతదేహాన్ని కిందికి దింపి బాత్‌రూమ్‌లో కాలుజారి ప్రయాదవశాత్తు పడిపోయి తలకు బలమైన గాయం తగిలి మరణించినట్లు చిత్రీకరించాడు.

పోస్టుమార్టం రిపోర్ట్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు కేసు మిస్టరీపై దృష్టి సారించారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్, మృతురాలి మెడకు ఉరివేసినట్లు గాయం, తలలో బలమైన గాయం, లివర్‌ సైతం దెబ్బతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు హత్య కేసుగా నిర్ధారణకు వచ్చారు. కాగా హత్య చేసిన భయంతో గత మూడు నెలలుగా గ్రామంలో లేకుండా తిరుగుతున్న నిందితుడు ఉదయకుమార్‌ రాజును మాటువేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు చెప్పిన నిజాలు పోలీసులను విస్తుగొలిపేలా చేశాయి. హత్య తానే చేశానని ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన హెచ్‌సీ హమీద్, పీసీలు సతీష్, కిషోర్, నరేష్‌లను జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు