నౌహీరా కేసులో.. పోలీసుల దూకుడు

13 Jun, 2019 11:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్స్ అధినేత నౌహీరా కేసులో సీసీఎస్ పోలీసులు దూకుడుపెంచారు. నౌహీరా షేక్ పై నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం వెయ్యి పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో ఏ1గా నౌహీరా షేక్ పేరును చేర్చారు. ఇప్పటికే నౌహీరా షేక్  చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. నౌ హీరా బ్యాంక్ ఖాతాల్లో జరిగిన లావాదేవీల్లో డిపాజిటర్ల నుండి తీసుకున్న డబ్బుతో పాటు, డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలు, నిధులు మళ్లించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది నౌహీరా బారిన పడ్డారు. ఆరేళ్ల క్రితం హీరా గ్రూప్ కంపెనీని నౌ హీరా ప్రారంభించారు.  డిపాజిట్‌లకి అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తానని, చైన్ పద్ధతిలో స్కీం కు నౌహీరా కంపెనీ తెర లేపింది. ప్రారంభంలో 200 కోట్ల రూపాయాలతో డిపాజిట్‌లు చేయించుకుంటే, ఇప్పుడు కంపెనీ ఖాతాల్లో 23 కోట్లు రూపాయలు మాత్రమే ఉన్నాయి. గతేడాది మే నుండి డిపాజిట్ దారులకు నౌ హీరా చెల్లింపులు ఆపేసింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నౌహీరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 2018 లో సీసీఎస్ పోలీసులు నౌ హీరా పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2018 లో హీరా షేక్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 28 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలింపుచేపట్టారు.

మరిన్ని వార్తలు