జయరామ్‌ హత్యకేసులో వీడని మిస్టరీ

2 Feb, 2019 09:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ (55) హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. హత్యకోణం, ఆస్తితగాదాలు ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరామ్‌ కాల్‌డేటా ఆధారంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారు. ఆస్తి, ఆర్థిక వివాదాలపైనే దృష్టి పెట్టిన పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి జయరామ్‌ కుటుంబ సభ్యులను వేరు వేరుగా విచారించారు. జూబ్లీహిల్స్‌లోని జయరామ్‌ ఇంటికి చేరుకొని సీసీపుటేజీని పరిశీలించారు.హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ను నందిగామ పోలీసులు తనిఖీ చేశారు. హోటల్‌లోని సీసీ పుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలించారు. జనవరి 31న ఆ హోటల్‌లో ఫార్మా కంపనీతో  జయరాం సమావేశమయ్యారు. సమావేశం తర్వాత తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తితో జయరాం బయటకు వెళ్లినట్లు సీసీ పుటేజ్‌ ద్వారా గుర్తించారు. ఆ తెల్ల చొక్కా వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరో వైపు జయరాం పోస్ట్‌మార్టంపై ఉత్కంఠ నెలకొంది. జయరాంపై విషప్రయోగం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరాం తలపై ఉన్న బ్లడ్‌ అతని ముక్కు నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. శరీరం రంగుమారడంతో జయరాంపై విషప్రయోగం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.జయరామ్‌ హత్యకు గురైన కారులో ఓ మహిళ కూడా ఉన్న పోలీసులు గుర్తించారు. (వ్యాపారవేత్త జయరామ్‌ అనుమానాస్పద మృతి)

జయరామ్‌ సమీప బంధువైన ఓ మహిళను హైదరాబాద్‌ నుంచి నందిగామకు తీసుకొచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జయరామ్‌ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? జయరామ్‌ ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? విజయవాడకు వస్తుండగా అతని కారును డ్రైవింగ్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? హత్యకోణం, ఆస్తితగాదాలు ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కారులో ఉన్న రెండో వ్యక్తి ఎవరన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు. జయరామ్‌ కారులో మద్యం సీసాలు లభించడం అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లెముందు జయరామ్‌ మద్యం సేవించారా? లేదా మధ్యలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీసుస్తున్నారు. అయితే జయరామ్‌కు మద్యం సేవించే అలవాటు లేదని ఆయన డ్రైవర్‌ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, శుక్రవారం నాడు పోస్టు మార్టం నిర్వహించిన జయరామ్‌ మృతదేహాన్ని అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. విదేశాల్లో ఉన్న జయరామ్‌ భార్య, పిల్లలు ఆదివారం ఉయదం హైదరాబాద్‌కు వస్తారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జయరామ్‌ భార్య, పిల్లలు వచ్చిన తర్వాతే అంత్యక్రియలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు