-

వనస్థలిపురం దోపిడీ గ్యాంగ్‌ను గుర్తించిన పోలీసులు

8 May, 2019 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎం వద్ద జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను గుర్తించారు. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సేఫ్‌గార్డ్‌ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరీకి పాల్పడింది చెన్నైకి చెందిన రాంజీ గ్యాంగ్‌గా గుర్తించారు. నగదు చోరీ తర్వాత దిల్‌సుఖ్‌ నగర్‌ వరకు దుండగులు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఆటో మారి చాదర్‌ఘాట్‌కు వెళ్లారు. చాదర్‌ ఘాట్‌లో మరోసారి ఆటో మారి పరారైనట్టు గుర్తించారు. మొత్తం మూడు ఆటోలు మారినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. 20 బృందాలతో రాంజీ గ్యాంగ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెక్‌ పోస్టులు, టోల్‌గేట్‌లను పోలీసులు అలెర్ట్‌ చేశారు. గతంలో రాంజీ గ్యాంగ్‌పై పలు కేసులున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే రాంజీ గ్యాంగ్‌ పలుమార్లు దోపిడి చేసింది. దృష్టి మరల్చి దోపిడి చేయడంలో రాంజీగ్యాంగ్‌ దిట్ట.

యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు జమచేయడానికి బేగంపేటకు చెందిన వైటర్‌ సేఫ్‌ గార్డ్‌ సంస్థకు చెందిన వాహనం నగదుతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. మొదట అబిడ్స్, ఉస్మాన్‌గంజ్, దిల్‌సుఖ్‌నగర్‌లలో ఉన్న ఏటీఎంలలో నగదు జమ చేసి ఉదయం 10.20 గంటలకు విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న వనస్థలిపురం పనామా చౌరస్తాకు చేరుకుంది. వాహనంలో నుంచి 3 లక్షల రూపాయలను యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో జమ చేయడానికి కస్టోడియన్స్‌ మహ్మద్‌ థా, విజయ్‌లు లోనికి వెళ్లారు. డ్రైవర్‌ సత్తికుమార్‌ వాహనం దిగి పక్కకు వెళ్లగా, వాహనంలోనే సెక్యూరిటీ గార్డు నాగేందర్‌ కూర్చున్నాడు.

ఏటీఎం నుంచి నగదు ఉన్న వాహనం వరకు వంద రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయని ఓ గుర్తు తెలియనివ్యక్తి వచ్చి నాగేందర్‌కు చెప్పి దృష్టి మళ్లించాడు. దీంతో నాగేందర్‌ వాహనం దిగి డబ్బులను ఏరుకుంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే గుర్తు తెలియనివ్యక్తి వాహనంలోకి చొరబడి అందులో ఉన్న నగదు పెట్టెను రెప్పపాటులో తీసుకుని రోడ్డు దాటి ప్యాసింజర్‌ ఆటో ఎక్కి పరారయ్యాడు. ఆ పెట్టెలో రూ.58.97 లక్షల నగదు ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డు వెంటనే వెనక్కి వచ్చి వాహనంలోకి వెళ్లి చూసేసరికి నగదు పెట్టె కనిపించలేదు. చోరీ జరిగిన విషయమై సెక్యూరిటీగార్డు, కస్టోడియన్స్‌ వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు