మరాఠా ఆందోళనలో మళ్లీ హింస

31 Jul, 2018 03:51 IST|Sakshi
షోలాపూర్‌లో మరాఠా ఆందోళనకారులు బస్సులకు నిప్పుపెట్టిన దృశ్యం

పుణెలో 40 బస్సులకు నిప్పు, మరో 50 వాహనాలు ధ్వంసం

ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీసిన ప్రజలు

గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు, 144 సెక్షన్‌

సాక్షి, ముంబై/పుణె/ఔరంగాబాద్‌: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్రలోని పుణెలో మరాఠాలు సోమవారం చేపట్టిన బంద్‌ హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్ల కోసం నాందేడ్, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఇద్దరు మరాఠాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పుణెలోని చకన్‌ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 40 బస్సులకు నిప్పంటించారు. మరో 50 బస్సులతో పాటు పలు ప్రైవేటు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినా అల్లరిమూకలు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఆందోళనలు షోలాపూర్, ముంబైకి కూడా విస్తరించాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను అధికారులు మోహరించారు.


ఫడ్నవిస్‌ క్షమాపణ కోరుతూ..
రాష్ట్రంలో కొందరు మరాఠాలు హింసకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ క్షమాపణ చెప్పాలని కోరుతూ మరాఠా క్రాంతి మోర్చా అనే సంస్థ పుణె బంద్‌కు పిలుపునిచ్చిందని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బంద్‌ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి దిగారన్నారు. దీంతో పలువురు ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారనీ, కొందరైతే సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో దాక్కున్నారని వెల్లడించారు. నగరంలో అల్లర్లను అణచేసేందుకు ర్యాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించామన్నారు. మరాఠాలకు రిజర్వేషన్‌ కోరుతూ వారం రోజుల క్రితం ఇదే సంస్థ పుణెలో ఆందోళన నిర్వహించిందన్నారు.

గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్‌
మరాఠాల ఆందోళన హింసాత్మక రూపం దాల్చిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ రాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావుతో సమావేశమైంది. మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అశోక్‌ చవాన్‌ నేతృత్వంలో గవర్నర్‌ను కలసిన నేతలు.. రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా ఫడ్నవీస్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఇద్దరి ప్రాణత్యాగం
మరాఠాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల మరాఠా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాయి. కానీ రాష్ట్రంలో కొన్నిచోట్ల అవి హింసాత్మక రూపం దాల్చడంతో ఆందోళనల్ని విరమించాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై మనస్తాపం చెందిన ఔరంగాబాద్‌ వాసి ప్రమోద్‌ జైసింగ్‌(35).. ఆదివారం రాత్రి ముకుంద్‌వాడీ ప్రాంతంలో ఓ రైలు ముందు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఈ విషయాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు తెలియజేశాడు. మరోవైపు నాందేడ్‌కు చెందిన మరో వ్యక్తి సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు