ఆ ‘మూడే’ కాల్పులకు దారితీశాయా..?

13 Nov, 2017 04:09 IST|Sakshi
జుబేర్‌ కార్యాలయం (ఇన్‌సెట్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముస్తఫా)

ఐటీ దాడుల సమాచారం, వ్యాపార లావాదేవీలతో పాటు అమ్మాయితో సఖ్యతే కారణమా?

జుబేర్‌ స్నేహితుల మాటలను బట్టి ఓ నిర్ణయానికొచ్చిన పోలీసులు

ఆస్పత్రిలోనే ముస్తఫా.. కేసును నీరుగార్చేందుకు

రంగంలోకి రాజకీయ నేతలు

సాక్షి, హైదరాబాద్ ‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ముస్తఫాపై కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఎంఐఎం నేత షానవాజ్‌ ఇంటిపై జరిగిన ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం ముస్తఫానే ఇచ్చి ఉంటాడన్న అనుమానమే ముస్తఫాపై కాల్పు లు జరగడానికి కారణంగా పోలీసులు భావి స్తున్నారు. దీంతోపాటు మరో రెండు కారణాలు కూడా పోలీసులు చెబుతున్నారు. షాన్‌వాజ్‌ కుమారుడు జుబేర్, ముస్తఫాలు కలసి నగర శివారు ప్రాంతాల్లో మూడు ఓపెన్‌ లే అవుట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఆర్థిక విషయాల్లోనూ ముస్తఫా చేతి వాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనికితోడు జుబేర్‌ ప్రేమించిన అమ్మాయితో ముస్తఫా సన్నిహితంగా ఉండటం కూడా కాల్పులకు దారి తీసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ విషయాలన్నీ పోలీసు అదుపులో ఉన్న జుబేర్‌ స్నేహితులు విచారణలో ప్రస్తావించినట్టు తెలిసింది. చికిత్స పొందుతున్న బాధితుడు ముస్తఫా వాంగ్మూలం నమోదు చేసేందుకు ఆస్పత్రికి వెళ్లిన పోలీసులతో ఆయనేమీ మాట్లాడలేదు. అసలు ఏం జరిగిందో తర్వాత చెబుతానంటూ సైగలు చేశాడు. దీంతో ఈ కేసులో ఏ పురోగతి సాధించలేదని పోలీసులు చెబుతున్నారు. కింగ్స్‌ కాలనీలోని జుబేర్‌ కార్యాలయంలోనే కాల్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆదివారం మరోసా రి క్లూస్‌ టీమ్‌ ఆధ్వర్యంలో సోదాలు చేశారు.

మిగతా వారు ఎక్కడ..?
జుబేర్‌ కార్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన విందులో 10 మంది వరకు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముస్తఫాను ఐదుగురు యువకులు ఓ కారులో తీసుకొచ్చినట్లు ఆస్పత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఆస్పత్రికి ఎంత వేగంగా వచ్చారో... అంతే వేగంగా ఆ యువకులు వెళ్ళిపోయారు. వారు ఎవరన్నది ప్రస్తుతం పోలీసులు నిర్ధారించే పనిలో పడ్డారు. ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు