‘పాలిటెక్నిక్‌’లో ఉద్రిక్తత

28 Sep, 2018 11:28 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి అశోక్‌(ఫైల్‌)

అధ్యాపకుల వేధింపులే కారణమని విద్యార్థుల ఆందోళన

చర్యలు తీసుకోవాలంటూ కళాశాల ఎదుట బైఠాయింపు

విచారణ జరిపిస్తామని హామీతో ఆందోళన విరమణ

తిరుపతి ఎడ్యుకేషన్‌: హాస్టల్‌ సీటు తొలగించారన్న మనస్తాపంతో పాలిటెక్నిక్‌ కళాశాల ఫైనలియర్‌ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించారు.  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తురకపల్లికి చెందిన దస్తగిరి, జ్ఞానమ్మ దంపతుల కుమారుడు అశోక్‌ తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ సెకండ్‌ షిప్ట్‌ ద్వారా తృతీయ సంవత్సరం ఈఈఈ అభ్యసిస్తున్నాడు. శనివారం తరగతి జరుగుతుండడంతో కాంట్రాక్ట్‌ అధ్యాపకురాలు పి.అఫియ అరుణోదయపై కామెంట్లు చేసేవాడు. అంతకుముందు కూడా అశోక్‌ రెండు మూడు మార్లు అలా చేయడంతో ఆమె అతని ప్రవర్తనపై విసుగు చెంది ప్రిన్సిపాల్‌ కె.వెంకట్రామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో అశోక్‌ను ప్రిన్సిపాల్‌ తన చాంబర్‌కు పిలిపించి తల్లిదండ్రులను తీసుకురావాలని తెలిపారు. లేకుంటే హాస్టల్‌ సీటు తొలగిస్తామని హెచ్చరించారు. తండ్రి మరణించడంతో తల్లికి  ఈ విషయం తెలిస్తే బాధపడుతుందని అశోక్‌ మనస్తాపం చెందాడు. ఆదివారం, సోమవారం హాస్టల్‌లోనే ఉన్నాడు. ఈ నెల 25వ తేదీ మంగళవారం కుటుంబ సభ్యులను తీసుకురాలేనని, హాస్టల్‌ నుంచి తనను తొలగించి, నాకు రావాల్సిన సొమ్ము తిరిగివ్వాలంటూ ప్రిన్సిపాల్‌కు లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు. అదే రోజు సాయంత్రం నుంచి హాస్టల్‌కు రాకపోవడంతో తోటి విద్యార్థులు బుధవారం వెతికారు. గురువారం ఉదయం రైలు కింద పడి యువకుడు మృతి చెందాడని తెలుసుకుని  వెళ్లి చూసి అశోక్‌గా గుర్తించారు.

అధ్యాపకుల వేధింపులతోనే...
అశోక్‌ మరణంతో ఆగ్రహించిన విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులతో కలిసి  కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈఈఈ విభాగంలోని అధ్యాపకులు కొందరు వేధిస్తుంటా రని ఆరోపించారు. కావాలనే మార్కులు తగ్గిస్తున్నారని వాపోయారు. ఆ విధంగానే శనివారం తరగతి గదిలో అశోక్‌ను మందలించడంతో పాటు అధ్యాపకురాలు చేయి చేసుకున్నారని పేర్కొన్నారు. పైగా హాస్టల్‌ సీటును తొలగిస్తామని చెప్పడంతో మనస్తాపం చెందాడని, మంగళవారం సాయంత్రం హాస్టల్‌ వదిలి పెట్టి వెళ్లడం కంటే చావడమే మేలని తమతో పేర్కొన్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి నుంచి హాస్టల్‌కు రాకపోవడంతో బుధవారం వెతికామని, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లామన్నారు. గుర్తు తెలియని యువకుడు రైలు కిండ పడి మృతి చెందాడని తెలుసుకుని వెళ్లి చూడగా అశోక్‌గా గుర్తించినట్లు తెలిపారు. చదువులో ఎప్పుడూ ముందుండే అశోక్‌ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని తాము ఊహిం చలేదని వాపోయారు.

ఉద్రిక్త వాతావరణం
విద్యార్థుల ఆందోళనతో పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రిన్సిపాల్‌ చాంబర్‌ కిటికీ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వెస్ట్‌ సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమకు నిర్ధిష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తెగేసి చెప్పారు. ప్రిన్సిపాల్‌ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆర్జేడీ సూరీడు నేతృత్వంలో విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

చర్యలు తీసుకుంటాం
అధ్యాపకులు వేధిస్తున్నారనే విషయంపై విద్యార్థులు తనకు ఫిర్యాదు చేయలేదు. అశోక్‌ మృతికి అధ్యాపకుల వేధింపులే కారణమని విచారణలో తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అధ్యాపకురాలి ఫిర్యాదుతో అశోక్‌ను మందలించాను. తల్లిదండ్రులను తీసుకురాకుంటే హాస్టల్‌ సీటు తొలగిస్తానని హెచ్చరించిన మాట వాస్తవమే. తల్లిదండ్రులను తీసుకురాలేనని, హాస్టల్‌ సీటు తొలగించాలని అతనే లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు. ఇంతలో ఇలా తమ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.– కె.వెంకట్రామిరెడ్డి, ప్రిన్సిపాల్,ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, తిరుపతి

మరిన్ని వార్తలు