ఫేసు బుక్కయ్యాడు..

11 May, 2018 11:40 IST|Sakshi
కుక్కల వ్యాపారితో సీఐ, ఎస్‌ఐ సిబ్బంది

పార్థీ గ్యాంగ్‌ తిరుగుతోందని ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌

రక్షణ కోసం కుక్కలు కొనుగోలు చేయాలన్న కుక్కల వ్యాపారి

ప్రజలను భయపెడుతున్నాడని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ప్రొద్దుటూరు క్రైం : పార్థీ గ్యాంగ్‌ తిరుగుతోందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తద్వారా తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవాలని ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టిన యువకుడిని రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలో పార్థీ గ్యాంగ్‌ సంచారం లేకున్నా ప్రజలు జంకుతున్నారు. ఒక వైపు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తరుణంలో వినోద్‌కుమార్‌రెడ్డి అనే కుక్కుల వ్యాపారి ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం సీఐ ఓబులేసు అరెస్ట్‌ విరాలను వెల్లడించారు. పాతకోట వినోద్‌కుమార్‌రెడ్డి ఆరేళ్ల నుంచి ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెలో భైరవ కెన్నల్‌ పేరుతో కుక్కల వ్యాపారం నిర్వహించేవాడు.

ఇటీవల జిల్లాలో పార్థీ గ్యాంగ్‌  గురించి పుకార్లను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవాలని చూశాడు. పార్థీ గ్యాంగ్‌ లేదని చెప్పిన పోలీసుల మాటలను నమ్మవద్దని, జిల్లాలో పార్థీ గ్యాంగ్‌ ముఠా సంచరిస్తోందని, ఇంటికి కాపలాగా ప్రతి ఒక్కరూ కుక్కను పెట్టుకోవాలని ప్రజలు నమ్మేలా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలను నమ్మించే విధంగా తప్పుడు ప్రచారం చేసిన అతన్ని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ప్రజల్లో ఉన్న పార్థీ గ్యాంగ్‌ భయాన్ని పోగొట్టేందుకు పోలీసులు  శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో పార్థీ గ్యాంగ్‌ ఉందని ప్రజల్లో భయాన్ని కలిగించడం నేరమని సీఐ తెలిపారు. యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో పార్థీ గ్యాంగ్‌ కదలికలు లేవు..
జిల్లాలో పార్థీ గ్యాంగ్‌ సంచారం లేదని సీఐ ఓబులేసు అన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో పార్థీ గ్యాంగ్‌ చేసిన నేరాలు, ఇతర సంఘటనలు ఒక్కటి కూడా లేదని చెప్పారు. ఎక్కడో జరిగిన సంఘటనలను జిల్లాలో జరిగినట్లు వాట్సప్, ఫేస్‌బుక్‌ ద్వారా కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులను ఇతరులకు పంపరాదని సీఐ సూచించారు. ఇలాంటి పుకార్లను, వదంతులను నమ్మరాదని కోరారు. పట్టణంలోనూ, గ్రామాల్లోనూ నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతున్నారని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు