‘హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు’

21 Nov, 2019 11:42 IST|Sakshi
మృతదేహాన్ని వెలికితీస్తున్న దృశ్యం, (ఇన్‌సెట్‌) కిరణ్‌కుమార్‌ (ఫైల్‌)

సాక్షి, కారేపల్లి(ఖమ్మం): పాతి పెట్టిన మృతదేహాన్ని 20 రోజుల తర్వాత వెలికితీసి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన ఘటన కారేపల్లి మండలం బోటితండా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బోటితండా గ్రామానికి చెందిన పీజీ విద్యార్థి ధర్మసోత్‌ కిరణ్‌ కుమార్‌ (25) ఈ నెల 1వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. కారేపల్లి పోలీసులకు తెలిసినా కేసు నమోదు చేయకపోవటంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిచి్చంది. ఈ క్రమంలోనే కారేపల్లి ఎస్‌ఐ వెంకన్నను సైతం ‘సాక్షి’వివరణ కోరగా.. ‘బాధితుడి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆత్మహత్యపై ఫిర్యాదు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించారని’ తెలిపారు. ఇదే విషయంపై ఈ నెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. బాధితుల కథనం ప్రకారం.. బోటితండాకు చెందిన ధర్మసోత్‌ కిరణ్‌ కుమార్‌ (25) ఖమ్మంలో పీజీ చదువుతున్నాడు. సమీప చీమలపాడు గ్రామానికి చెందిన  అతని మిత్రుడు,  చింతలతండాకు చెందిన ఓ యువతి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

వీరిరువురు బోటితండాలోని కిరణ్‌ కుమార్‌ బంధువుల ఇంట్లో ఉండగా..అక్కడే కిరణ్‌ కుమార్‌ సైతం ఉన్నాడు. ఈ క్రమంలో యువతి బంధువులు వచ్చి కిరణ్‌ కుమార్‌ను, తన స్నేహితుడిని దూషించారు. అదే రోజు రాత్రి కిరణ్‌ కుమార్‌ అదే ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం మృతుడి తల్లిదండ్రులు రేలకాయలపల్లి వీఆర్వో  ప్రకాశ్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగరేణి తహసీల్దార్‌ డి పుల్లయ్య, íసీఐ బి శ్రీనివాసులు, ఎస్‌ఐ పొదిల వెంకన్నల సమక్షంలో 20 రోజుల క్రితం పాతిపెట్టిన శవాన్ని బయటికి తీశారు. ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కిషోర్, హర్షిణి ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు.  బోటితండాలో ఉద్రిక్తత నెలకొనగా, కామేపల్లి, కారేపల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. 

హత్య చేసి.. ఆత్మహత్యగా..
నా కొడుకు కిరణ్‌ కుమార్‌ను ఆరుగురు వ్యక్తులు కలిసి హత్య చేసి,  ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి తల్లిదండ్రులు భద్రు, కాంతి విలేకరుల ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు నచ్చజెప్పటంతో అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  పెద్ద మనుషులు సుమారు రూ.80వేలు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు