అనుమానం.. పెనుభూతం

15 May, 2018 13:18 IST|Sakshi
నెల్లూరు: మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు

ప్రకాశం జిల్లా ఉలవపాడులో రైలు పట్టాలపై కుటుంబం  ఆత్మహత్య

భార్యాభర్తలతోపాటు నలుగురు చిన్నారులు మృతి

నెల్లూరులో సోమవారం  అంత్యక్రియలు

మిన్నంటిన కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు

నెల్లూరు(క్రైమ్‌): దంపతుల నడుమ అనుమానం పెనుభూతంగా మారింది. ఆరు నిండుప్రాణాలను బలితీసుకొంది. ముద్దుముద్దు మాటలతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన చిన్నారులను సైతం విగతజీవులుగా మార్చేసింది. ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఆదివారం రాత్రి ఆ కుటుంబం రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్ప డింది. వారి మృతదేహాలను ప్రత్యేక వాహనంలో బాధిత కటుంబసభ్యులు, బంధువులు సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని బోడిగాడితోటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నెల్లూరు సంతపేట మహాలక్ష్మమ్మగుడి ప్రాంతానికి చెందిన నారాయణ, ఉమ దంపతుల కుమారుడు పి.సునిల్‌(25)కు కందుకూరుకు చెందిన రమాదేవి/రమ(23)తో 2012లో వివాహమైంది. అల్యూమినియం వంటసామగ్రి విక్రయించుకుంటూ వారు జీవనం సాగించేవారు. వ్యాపార నిమిత్తం కొంతకాలం క్రితం సునిల్‌ కాపురాన్ని వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేల్‌కు మార్చాడు. వారికి ఉష(5), కవలలు కల్యాణ్‌(3), కల్యాణి(3), ఎనిమిది నెలల బాబు ఉన్నారు.

సజావుగా సాగాల్సిన వీరి కాపురంలో అనుమానం పెనుభూతంలా దాపురించింది. భార్య ప్రవర్తనపై సునిల్‌ అనుమానం పెంచుకొన్నాడు. ఆమె సెల్‌ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడుతుందో వారి సంభాషణలన్నీ రికార్డ్‌ చేయసాగాడు. అలా ఆమె తప్పులను ప్రస్తావిసూ తరచూ నిలదీసేవాడు. దీంతో దంపతుల నడుమ విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రమ వారం రోజుల క్రితం కందుకూరులోని తన పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం సునిల్‌ తన తల్లిదండ్రులను, బంధువులను తీసుకొని కందుకూరు వచ్చాడు. ఇరువర్గాల íపెద్దలు వారికి సర్దిచెప్పారు. కాపురాన్ని చక్కగా చేసుకోవాలని సూచించారు. దీంతో భార్య, పిల్లలను తమ వెంట తీసుకొని ఉలవపాడు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తిరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ సునిల్, రమ తమ పిల్లలతో కలిసి ఉలవపాడు రైల్వేస్టేషన్‌లో సంఘమిత్ర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. రైల్వే పోలీసులు మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించి సునిల్‌ కుటుంబసభ్యులకు సోమవారం అప్పగించారు. సోమవారం సాయంత్రం బాధిత కుటుంబసభ్యులు మృతదేహాలను అంబులెన్స్‌లో నెల్లూరు బోడిగాడితోటకు తరలించారు.

మిన్నంటిన రోదనలు
సునిల్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన బంధువులకు, స్నేహితులకు తెలియడంతో వారు సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున బోడిగాడితోటలోని శ్మశానవాటికకు చేరుకున్నారు. మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానవాటికకు తరలించారు. మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. ముద్దుముద్దు మాటలతో అందరినీ అలరించా  ల్సిన చిన్నారులు విగతజీవులుగా మారి చాపల్లో చుట్టి ఉండటాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అశ్రనయనాల నడుమ సునిల్, రమలతోపాటు వారి పిల్లల అంత్యక్రియలు జరిగాయి. మృతదేహాలను నెల్లూరుకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మృతుడి తల్లిదండ్రులు ఇంటి వద్దకు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గంటల తరబడి మృతదేహాలను కడసారి చూసేందుకు వేచిచూశారు. అయితే బాధిత కుటుంబసభ్యులు నేరుగా మృతదేహాలను బోడిగాడితోటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారన్న విషయం తెలుసుకుని బాధపడ్డారు.

ఆరు మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి
ఒంగోలు క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే కుటుంబంలో ఆరుగురి ఆత్మహత్యకు సంబంధించి మృతదేహాలకు ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలలో సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా ఉలవపాడు రైల్వేస్టేషన్‌ సమీపంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లడంతో నెల్లూరుకు చెందిన పాశం సునిల్‌(28), రమ(24) దంపతులతోపాటు వారి పిల్లలు ఉష(5), కవలలు కల్యాణ్, కల్యాణి(3), ఎనిమిది నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలో పూర్తి వివరాలతో కూడిన పంచనామాను రిమ్స్‌లో ఉలవపాడు తహసీల్దార్‌ పద్మావతి సమక్షంలో ఒంగోలు రైల్వే జీఆర్‌పీ సీఐ పి.శ్రీనివాసరావు, చీరాల ఎస్సై రామిరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.జె.కిషోర్‌బాబు నిర్వహించారు. రిమ్స్‌ వైద్యులు రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుని బంధువు పాశం కొండయ్య, అన్నయ్య పాశం అని ల్‌ ఆరు మృతదేహాలను రిమ్స్‌ నుంచి నెల్లూరు పట్టణానికి తీసుకెళ్లారు. జీఆర్‌పీ సీఐ పి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మాంసపు ముద్దలు.. రక్తపు మరకలు
ఉలవపాడు: ఉలవపాడు రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు సోమవారం తెల్లవారుజామునే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాల మధ్యలో మాంసపు ముద్దలు, రక్తపు మరకలు చూసి చలించిపోయారు. హృదయ విదారకరమైన ఘటనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్పర్థలు వచ్చి ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసి కష్టాలు ఎదుర్కొని సంసారం చేయాలి కానీ ఇలా ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని చర్చించుకోవడం కనిపించింది. ఐదేళ్లలోపు పిల్లలు నలుగురు మృతి చెందారని తెలుసుకున్న మహిళలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలపై మాంసపు ముద్దలను చూసి కంటతడి పెట్టారు.

మరిన్ని వార్తలు