ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆస్పత్రి

9 Feb, 2018 08:42 IST|Sakshi
పోస్టుమార్టం కోసం వివరాలు సేకరిస్తున్న పోలీసులు

మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

బంధువులకు అప్పగింత

శ్రీకాళహస్తి రూరల్‌: మండలంలోని వాంపల్లి సమీపంలో ఏర్పేడు–వెంకటగిరి రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి బంధువుల ఆర్తనాదాలతో శ్రీకాళహస్తి ఆస్పత్రి దద్దరిల్లింది. యువకుల మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ సుదర్శన్‌ప్రసాద్‌ కథనం మేరకు.. శ్రీకాళహస్తి రూరల్‌ వాంపల్లి సమీపంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతులు చిత్తూరు పట్టణానికి చెందిన కిరణ్‌(35), రాజేష్‌(34), జనశక్తి(34). వీరు మంచి స్నేహితులు. ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో గురువారం శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలివచ్చారు. మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. 

ముగ్గురూ స్నేహితులు: చిత్తూరు పట్టణంలోని హకీంసాహెబ్‌ వీధికి చెందిన టౌన్‌ బ్యాంకు విశ్రాంతి ఉద్యోగి శంకరయ్య కుమారుడు కిరణ్‌ 12 ఏళ్ల నుంచి వెంకటగిరి సమీపంలోని 9వ బెటాలియన్‌లో కమాండెంట్‌ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరేళ్ల క్రితం పెళ్లి అయింది. ఇంకా పిల్లలు లేరు. ఇతని కుటుంబ సభ్యులు బెటాలియన్‌ ఆవరణలో ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. చిత్తూరు పట్టణంలోని న్యూ బాలాజీ కాలనీకి చెందిన గణేష్‌ కుమారుడు రాజేష్‌ ఐదేళ్ల నుంచి ట్రాఫిక్‌ కానస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇతనికి భార్య ఒకటిన్నర ఏడాది కలిగిన బాబు ఉన్నారు. ఇతను చిత్తూరులోనే నివాసం ఉంటున్నాడు. చిత్తూరు పట్టణంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన కాశీమాణిక్యం కుమారుడు జనశక్తి ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇతనికి భార్య, ఏడాది వయస్సు కలిగిన కుమార్తె ఉన్నారు. కొద్ది రోజుల నుంచి కిరణ్‌ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతన్ని పరామర్శించడానికి చిత్తూరు నుంచి రాజేష్‌. జనశక్తి బెటాలియన్‌కు వచ్చారు. అనంతరం రాజేష్, జనశక్తిని బస్సు ఎక్కించడానికి కిరణ్‌ అతని స్కూటీలో వాంపల్లికి బయలుదేరారు. వెంకటగిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొనటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.

మరిన్ని వార్తలు