గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా

8 Mar, 2020 16:08 IST|Sakshi

మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు!

మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, రేపు అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు వ్యక‍్తం అవుతున్నాయి. మారుతీరావు ఇటీవలే వీలునామా మార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమృత భర్త ప్రణయ్‌ హత్యకు ముందే మారుతీరావు తన ఆస్తిని మొత్తం సోదరుడి పేరున వీలునామా రాశారు. అయితే ఇటీవలే వీలునామా నుంచి సోదరుడి పేరు తీసేసి ..తిరగరాశారు. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు తన కుమార్తె అమృతతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!)

అయితే రెండు రోజుల క్రితం మారుతీరావుతో బంధువులు, సోదరులు గొడవ పడినట్లు తెలుస్తోంది. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోయిందని వారు ఘర్షణ పడినట్లు సమాచారం. మారుతీరావు వల్ల తమ కొడుకులకు వివాహాలు కావడం లేదని, ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందు రావడం లేదని గొడవ పడినట్లు భోగట్టా. ఓ వైపు కుటుంబ సభ్యులతో వివాదాలు, మరోవైపు ప్రణయ్‌ హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతో  తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. సూసైడ్‌ నోటులో ‘గిరిజా క్షమించు... అమృత అమ్మ దగ్గరకు రా’  అని రాశారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (మారుతీరావు సూసైడ్ నోట్! నోట్లో.. )

మీడియా ఊహించి రాయొద్దు..
మారుతీరావు ఆత్మహత్యపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన సోదరుడు శ్రవణ్‌ ఖండించారు. తన అన్నతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. విబేధాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు. అయితే ప్రణయ్‌ హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. అనవసరంగా కేసులో ఇరుక్కున్నాననే నేపథ్యంలోనే సోదరుడితో మాట్లాడటం లేదన్నారు. దీంతో తన తన కుటుంబం ఇబ్బందుల పాలైందన్న ఆగ్రహంతో మారుతీరావుతో గత ఏడాది మే 15 నుంచి మాట్లాడటం లేదని తెలిపారు. మీడియా ఊహించి రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్న ఆత్మహత్య విషయం తెలియగానే తన వదినను తీసుకుని హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పారు. సూసైడ్‌ నోట్‌లో ఏముందో తెలియదని, ఆస్తికి సంబంధించిన వీలునామా రాశారో లేదా అనేది కూడా తనకు ఏమీ తెలియదని శ్రవణ్‌ పేర్కొన్నారు.

మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషంతాగి ఆత్మహత్య చేసుకున్న తిరునగరి మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు రేపు (సోమవారం) మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మారుతీరావు నిన్నరాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. (అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు)

విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.  పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. మారుతీరావు మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. (అమృత తండ్రి షెడ్డులో మృతదేహం ఎవరిది?)

ఆ మృతదేహం ఎవరిది?
తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ఆమె భర్త ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడని కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేయడంతో 7నెలలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ కేసులో మారుతీరావుతోపాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్‌, మరో వ్యక్తిపైనా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. ఈ తరుణంలోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. (అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్)

మరిన్ని వార్తలు