రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం

15 Aug, 2019 08:23 IST|Sakshi

సాక్షి, గురజాల: పురిటినొప్పులతో బాధపడుతూ రెండేళ్ల కిందట గురజాలలోని శ్రీకాంత్‌ నర్సింగ్‌ హోంలో తల్లీబిడ్డ మృతి చెందారు. మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డకు అప్పట్లో సరైన వైద్యం అందించడంలో డాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందువల్లే తల్లీబిడ్డ మృతి చెందారని  ఇటీవల రాష్ట్ర మానవహక్కుల కమిషన్, ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు.

మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి శ్యామ్‌ రెండో కుమార్తె మాచర్ల శిరీషా రెండోసారి గర్భం దాల్చడంతో 2017 మే నెల 26వ తేదీన గురజాల శ్రీకాంత్‌ నర్సింగ్‌ హోంలో చేర్పించారు. వైద్యం చేసే క్రమంలో తల్లీ బిడ్డ మృతి చెందారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాలను మాడుగుల శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. అప్పట్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.  ప్రస్తుతం 10 రోజుల నుంచి మృతురాలి కుటుంబీకులు మాచర్ల శిరీషా, ఆమెకు పుట్టిన బిడ్డ మరణంపై అనుమానం ఉందని ఫిర్యాదులు చేశారు.

దీంతో సీఐ ఓ.దుర్గాప్రసాద్, తహసీల్దార్‌ షేక్‌ గౌస్‌బుడేసాహేబ్‌ సమక్షంలో బుధవారం గుంటూరు మెడికల్‌ కాలేజీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ నిపుణులు డాక్టర్‌ రమేష్‌బాబు, డాక్టర్‌ శివకామేశ్వరావు తల్లీబిడ్డ ఖననం చేసిన చోటు తవ్వకాలు చేపట్టి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వివరాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బాలకృష్ణ, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది, మృతురాలి బంధువులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు