ఓ ఉద్యోగి ఆతృతకు.. నిండు ప్రాణం బలి

22 Oct, 2018 07:45 IST|Sakshi
మరణించిన విద్యుత్‌ కార్మికుడు పని చేయించుకున్న బ్యాంకు ఉద్యోగి శివరాం

విద్యుత్‌ కూలీని స్తంభం ఎక్కించిన వైనం

ఇంటి వైరు సరిచేస్తుండగా షాక్‌కు గురై మృత్యువాత

విద్యుత్‌ శాఖ అధికారుల సమన్వయలోపం, నిర్లక్ష్యం

శ్రీకాకుళం, కాశీబుగ్గ: తిత్లీ తుఫాన్‌ విజృంభణ నేపథ్యంలో జిల్లాలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు ఇతర జిల్లా నుంచి సంబంధిత సిబ్బందితో వచ్చిన ఓ సహాయకుడు విద్యుత్‌ఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. తన ఇంటికి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలని ఓ ఉద్యోగి ఆతృతకు ఇలా నిండు ప్రాణం బలి కావడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం సంచలనం కలిగించింది.

వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీ పరిధి 16వ వార్డు గాంధీనగర్‌లో పన్నెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ నివాసముంటున్న స్టేట్‌ బ్యాంకు ఉద్యోగి శివరాం తన ఇంటికి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు ఎల్‌సీ(విద్యుత్‌ను అనుమతితో నిలిపివేసే పక్రియ) తీసుకోకుండానే అక్రమంగా పనులు చేయించాడు. ఈయన ఓ విద్యుత్‌ కూలీని తీసుకొచ్చి స్థానికంగా స్తంభం ఎక్కించాడు. ఈ క్రమంలో వైరు కలుపుతుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సెలర్‌ బోర బుజ్జి, ఉప చైర్మన్‌ గురిటి సూర్యనారాయణ, కౌన్సెలర్‌ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్‌ సిబ్బంది తమ సహాయకులుగా (రోజు కూలీలు) పది వేల మంది వరకు తీసుకొచ్చారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి వచ్చిన ఈ వ్యక్తి పది రోజులుగా పనులు చేస్తూ ఇలా మృత్యవాత పడ్డాడు. ఇటువంటి కార్మికులకు స్థానికంగా పలువురు నగదు ఆశ చూపి ఈ విధంగా వినియోగిస్తుండటం గమనార్హం. ఈ విషయమై ఇంకా కేసు నమోదు కాలేదు.

మరిన్ని వార్తలు