'ఏ ఒక్కరినీ వదలకండని సీఎం జగన్‌ ఆదేశించారు'

12 Jan, 2020 10:11 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్, వెనుక ముసుగులు ధరించిన నిందితులు

ప్రస్తుతం 16 మంది అరెస్టు 

మరో 123 మంది కోసం పోలీసుల గాలింపు 

వీరి అక్రమ వ్యాపారంతో ప్రభుత్వానికి ఏకంగా రూ.300 కోట్ల నష్టం 

పరోక్షంగా రూ.900 కోట్లకుపైగానే నష్టమని అధికారుల అంచనా 

అరెస్టయిన వారిలో కీలక నిందితుడు చంద్రమోహన్‌ అలియాస్‌ చంద్రమౌళి  

నిందితుల వివరాలు వెల్లడించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

సాక్షి, ఒంగోలు: గుట్టుచప్పుడు కాకుండా అధికారులను మేనేజ్‌ చేస్తూ కోట్ల రూపాయలు గడించిన మైనింగ్‌ మాఫియాకు సంబంధించి కీలకంగా వ్యవహంచిన 16 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ వెల్లడించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. 16 మంది నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశారో వివరించారు. ముంబై మాఫియాను తలపించే రీతిలో చేసిన వీరి మోసంపై సీబీఐ  విచారణ అక్కర్లేదని, తామే మొత్తం నిందితులు గుట్టు రట్టు చేస్తామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ధీమా వ్యక్తం చేశారు.
 
నేరం వెలుగు చూసింది ఇలా.. 
గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృత నేరంగా మారిన కేసు.. అద్దంకి స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వీపీ శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టకుండా నకిలీ ఫరంలతో 290 కోట్ల 49 లక్షల 75 వేల 81 రూపాయల వ్యాపారం చేసి 52 కోట్ల 20 లక్షల 19 వేల 33 రూపాయల పన్ను ఎగ్గొట్టారని, తాము విచారించగా ఫరంలన్నీ తప్పుడు చిరునామాలతో ఆన్‌లైన్‌లో సృష్టించినట్లుగా శ్రీనివాస్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్టూరు పరిసర ప్రాంతాల్లో ఒన్‌మ్యాన్‌ ఫ్రీ బిజినెస్‌ పాలసీ కింద 2018 ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 2919 సెపె్టంబర్‌ 28వ తేదీ వరకు ఒన్‌మ్యాన్‌ ఫ్రీ బిజినెస్‌ పాలసీ కింద ప్రభుత్వం కలి్పంచిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడినట్లు శ్రీనివాస్‌ తేల్చడంతో నిందితుల నేరం వెలుగులోకి వచ్చింది.

దీనిపై మార్టూరు ఎస్‌ఐ మల్లికార్జున్‌ తొలుత సాంకేతిక పరిజ్ఞానం, స్థానికుల ద్వారా సమాచారం సేకరించి నిందితులు గుట్టు వెలికితీయడంతో ఇదో పెద్ద మాఫియా అన్న వ్యవహారం స్పష్టమైంది. ఈ కేసును చేధించడం ఒక్క ఎస్‌ఐతో సాధ్యం కాదని భావించిన ఎస్పీ..ఏకంగా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, అద్దంకి సీఐ టి.అశోక్‌వర్థన్, ఇంకొల్లు సీఐ రాంబాబు, మార్టూరు ఎస్‌ఐ మల్లికార్జున, మేదరమెట్ల ఎస్‌ఐ బాలకృష్ణతో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌)ను ఏర్పాటు చేశారు.
 
చిన కోటయ్యకు లోడుకు రూ.6 వేలు  
ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దులు దాటించగలిగారు కానీ దాచేపల్లి వద్ద వీరి వ్యవహారానికి గండిపడింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో యరపతినేని అనుచరునిగా పేరుండి సీబీఐ కేసులో నిందితుడైన చినకోటయ్య రాజకీయ నాయకులు, అధికారులను మేనేజ్‌ చేసేందుకు లోడుకు రూ.6 వేలు చొప్పున అందించేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన్నూ విచారించేందుకు పోలీసులు దృష్టి సారించారు.
 
తొలుత నలుగురు.. నేడు 16 మంది  
ఈ కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం తాము నలుగురిని అరెస్టు చేశామని, ప్రస్తుతం 16 మందిని అరెస్టు చేశామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టకుండా జీఎస్‌టీ, మైనింగ్‌ బిల్లులకు సంబంధించి రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందని, బిల్లులు లేకుండా తరలి వెళ్లిన సరుకు విలువ రూ.900 కోట్లకుపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా 123 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అంతే కాకుండా అక్రమ వ్యాపార లావాదేవీలు నిర్వహించిన మార్కర్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. నేరంలో పాత్ర ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సార్లు తమను ఆదేశించారని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తులో విశేషంగా కృషి చేస్తున్నారంటూ సిట్‌ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
 
అరెస్టయిన నిందితులు వీరే..  
పఠాన్‌ అరీఫుల్లా, షేక్‌ షబ్బీర్, షీక్‌ రహీం (మార్టూరు గొట్టిపాటి హనుమంతురావు కాలనీ), కోనేరు సతీష్‌ (మార్టూరు మద్ది సత్యనారాయణ కాలనీ), గడ్డం హేమంత్‌ (మార్టూరు ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌), ఆలకుంట రవికుమార్‌ (బల్లికురవ మండలం వైదన), వేముల జెల్లయ్య (బళ్లారి సమీపంలోని టోర్నగల్‌ గ్రామం), పఠాన్‌ జానీబాషా (మార్టూరులోని గన్నవరం రోడ్డు), కల్లేపల్లి శివప్రసాద్‌ వర్మ (మార్టూరు మండలం రాజుగారిపాలెం), గుర్రంకొండ భార్గవ్‌ (మార్టూరు విద్యానగర్‌), చల్లగొండ కార్తీక్‌ చౌదరి (మార్టూరు తూర్పు బజారు), ఏలికా రవి (గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నవరం), పెద్దిశెట్టి రవికుమార్‌ (మార్టూరు విద్యానగర్‌ మొదటి లైను), బిళ్లా చినబాబు (మార్టూరు మండలం నాగరాజుపల్లి), కోటగిరి శ్రీనివాసరావు (మార్టూరు), కాకుమాను చంద్రమోహన్‌ అలియాస్‌ చంద్రమౌళి (గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం చించాలిడొంక). 

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అక్రమాలు
సిట్‌ దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత యర్రపోగు మహేంద్ర, అమర్నేని వెంకటేశ్వర్లు మార్టూరు పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి అవసరమైన రుణాలు ఇప్పిస్తామంటూ వారికి సంబంధించిన ధ్రువపత్రాలు సేకరించారు. వాటిని వారు జంపని వెంకట సుబ్బారావు, చేబ్రోలు రమే‹Ù, ఆడిటర్‌ చేబ్రోలు రమేష్‌నాయుడులకు ఇచ్చారు. వారు వాటి సాయంతో 26 ఫోన్‌ నంబర్లు, 17 ఈ మెయిల్స్‌ సాయంతో 278 నకిలీ ఫరంలు సృష్టించారు. ఒక్కో ఫరాన్ని వారు రూ.35 వేలు చొప్పున విక్రయించేవారు. ఇలా మొత్తం 19 గ్రూపులకు విక్రయించారు.

ఒక్కో గ్రూపులో 6 నుంచి 10 మంది ఉంటారు.ఈ మొత్తం గ్రూపుల్లో మార్టూరు పరిసర ప్రాంతాల్లోని వారు 70 మంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ 19 గ్రూపుల్లోని వారు తాము కొనుగోలు చేసిన ఫరంల ద్వారా నకిలీ వేబిల్లులు సృష్టించేవారు. ఇలా నకిలీ ఫరంలను పఠాన్‌ ఆరీఫుల్లా, దరియావలి, షబ్బీర్, జాని, కాలేషా, శివవర్మ, కార్తీక్, షరీఫ్, భార్గవ్, శివ, జైపాల్‌రెడ్డి, కాళి, రహీం, ఎల్లయ్య, హేమంత్, ఖలీల్, రవి, సందీప్, నాగరాజు అనే వారు కొనుగోలు చేశారు. వీరంతా సంబంధిత గ్రూపుల లీడర్లు. ఇలా తాము కొన్న నకిలీ ఫరం ద్వారా 33 మంది మార్కర్లతో వీరు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్కో లారీ గ్రానైట్‌ లోడుకు ప్రభుత్వానికి రూ.75 వేలు నుంచి లక్ష రూపాయల వరకు మార్కర్‌ చెల్లించాల్సి ఉంటుంది. నకిలీ ఫరాలు కొనుగోలు చేసిన వారు అందుకు భిన్నంగా మార్కర్ల వద్ద రూ.30 వేలు తీసుకునేవారు. 

అందులో తాము రూ.20 వేలు ఉంచుకుని మిగిలిన రూ.10 వేలు చంద్రమౌళి, కామేశ్వరరావు అలియాస్‌ కాముడు, సుదీర్, నన్నేషు, జానీ, కరీం, చినబాబు, సుదర్శన్, మల్లికార్జున, అంజయ్య, నాగయ్య, శేషు అనే వారికి ఇచ్చి లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే బాధ్యతను అప్పగించేవారు. ఇందుకుగాను ప్రతి గ్రూపులో  ఉన్న సభ్యుల్లో ఏడుగురు అక్రమ గ్రానైట్‌ తరలుతున్న లారీలకు ముందు పైలెట్లుగా వ్యవహరించేవారు. ఎక్కడైనా అధికారులు ఉన్నా సమాచారం అందిస్తూ వాహనాలను దారి మళ్లించడం వీరి పని. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్లే లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే బాధ్యత శేషు అనే వ్యక్తి తీసుకునేవాడు. మిగిలిన వారు మాచర్ల, దాచేపల్లి, చెన్నై, బెంగళూరు వైపు ఎటువంటి తనిఖీలు జరగకుండా, వాహనాలు సీజ్‌ కాకుండా జాగ్రత్త పడేవారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా