సైబర్‌ ఉచ్చులో పీరాపురం యువకుడు

1 May, 2020 13:29 IST|Sakshi
కొండపి ఎస్‌బీఐ మేనేజర్‌తో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసరావు

లాటరీ పేరుతో రూ.46 లక్షలకు

మోసపోయిన నాగబ్రహ్మయ్య

సైబర్‌ నేరగాళ్లపై కొండపి పోలీసుస్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆరా

కొండపి: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ యువకుడు ఏకంగా రూ.46 లక్షలకు మోసపోయాడు. ఈ సంఘటన కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం పీరాపురంలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసుస్టేషన్‌లో సింగరాయకొండ సీఐ శ్రీనివాసరావు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. జరుగుమల్లి మండలం పీరాపురం గ్రామానికి చెందిన దేపూరి నాగబ్రహ్మయ్యకు ఫిబ్రవరిలో గ్లోబల్‌ వాట్సప్‌ అనే నకిలీ కంపెనీ నుంచి మెయిల్‌ వచ్చింది. రూ.3 కోట్ల 60 లక్షలు గెల్చుకున్నావన్నది ఆ మెయిల్‌ సారాంశం. నాగబ్రహ్మయ్య ఆశపడ్డాడు. ఆ మొత్తం నగదు జమ చేయాలంటే 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. దాన్ని నిజమని నమ్మిన యువకుడు ఆదాయపు పన్ను పేరుతో రూ.46 లక్షలు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో పాటు నాగబ్రహ్మయ్య డిగ్రీ చదివి ఉండటంతో కుటుంబ సభ్యుల ఆర్థిలావాదేవీలన్నీ అతడే చూసుకుంటుంటాడు. కుటుంబ సభ్యులు భూములు కొనేందుకు సిద్ధం చేసిన నగదుతో పాటు బంధువుల వద్ద సైతం కొంత డబ్బు, సోదరి వద్ద మరికొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. ఈ మొత్తం డబ్బును ఫిబ్రవరి  27 నుంచి మార్చి 10వ తేదీ వరకు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోని వివిధ బ్యాంకులకు చెందిన 20 ఖాతాలకు 30 సార్లు డబ్బులు విడతల వారీగా మోసగాళ్లు ఇచ్చి ఖాతా నంబర్లకు జమ చేశాడు.

బ్యాంకు అధికారులకు అనుమానం
నాగబ్రహ్మయ్య ఇన్ని సార్లు ఇతర రాష్ట్రాలకు నగదు జమ చేస్తుండటంపై బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి అతడిని ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులు భవన నిర్మాణ రంగంలో ముఠాలు కట్టి వివిధ రాష్ట్రాల్లో పనులు చేయిస్తుంటారని, అక్కడికి డబ్బులు పంపుతున్నట్లు నమ్మబలికాడు. అయినా అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు అతడి ఇంటికి వెళ్లి ఆరా తీయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన యువకుడు లబోదిబోమంటూ స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు బాధితుడు బ్రహ్మయ్య కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు కొండపి ఎస్‌బీఐ మేనేజర్‌తోనూ మాట్లాడారు. సైబర్‌ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని, అనుమానం వస్తే సమాచారం దాచకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సీఐ శ్రీనివాసరావు సూచించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ సైతం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు