కడుపునొప్పితో గర్భిణి మృతి 

5 Jun, 2018 14:26 IST|Sakshi
జంబి పోసక్క మృతదేహం 

మొక్కులు చెల్లించాలంటూ కుటుంబీకుల కాలయాపన

గ్రామంలో విషాద ఛాయలు

ఏడు నెలల గర్భిణి.. ఇంకో రెండు నెలలైతే మాతృత్వాన్ని వరంగా పొందుతానని సంబరపడింది. ఆ సమయంలో కడుపులో తీవ్రమైన నొప్పి.. కుటుంబీకులకు చెబితే గాలి దూలి అంటూ మూఢనమ్మకాలతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంటికే పరిమితం చేశారు.

ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆలోపే ఆమె నొప్పి భరించలేక పరలోకానికి వెళ్లిపోయింది. మూఢనమ్మకం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.

భీమిని(నెన్నెల) : నెన్నెల మండలం మైలారం గిరిజన వాడకు చెందిన జంబి పోసక్క(25) కడుపు నొప్పితో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. పోసక్క ఏడు నెలల గర్భవతి. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తే నొప్పి తగ్గిపోతుందని కుటుంబీకులు పోసక్కను ఇంట్లోనే ఉంచి సమయం వృథా చేశారు.

ప్రాణాల మీదకు వచ్చాక ఆటోలో నెన్నెల పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఝాన్సీరాణి పోసక్కను పరీక్షించి అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. నొప్పి వచ్చిన వెంటనే ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణానికి ఎలాంటి హాని ఉండేది కాదని తెలిపారు. పోసక్క భర్త వ్యవసాయ కూలీ. పోసక్కకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు