పక్కా వ్యూహంతోనే గర్భిణి హత్య

16 Feb, 2018 03:36 IST|Sakshi

8 రోజుల ముందే కటింగ్‌ మిషీన్, ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు, బస్తాల కొనుగోలు

వికాస్, అమర్‌ రిమాండ్‌: డీసీపీ విశ్వప్రసాద్‌  

హైదరాబాద్‌: పక్కా వ్యూహంతోనే గర్భిణి బింగీ అలియాస్‌ పింకీని హత్య చేశారని మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వికాస్‌ కశ్యప్‌(32), అమర్‌కాంత్‌ ఝా(24)ను రిమాండ్‌కు తరలించామన్నారు. గురువారం గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడించారు. జనవరి 27 రాత్రి సిద్ధిఖీనగర్‌లోని ఇంట్లో గర్భిణి బింగీ టీవీ చూస్తుండగా వికాస్, అమర్‌కాంత్, మమత ఝా దాడికి పాల్పడ్డారని తెలిపారు.

అనంతరం బింగీ మృతదేహాన్ని బాత్‌ రూమ్‌లో ఉంచి 28న మిషీన్‌తో కాళ్లు, చేతులు కోశారని చెప్పారు. శరీర భాగాలను బస్తాల్లో మూటగట్టి జనవరి 29 తెల్లవారుజామున యమహా బైక్‌పై అమర్‌కాంత్, మమత ఝా శ్రీరాంనగర్‌లో పడేశారన్నారు. బైక్‌ను బోరబండలోని పాత ఇంట్లో పడేసిన అమర్‌ ఫిబ్రవరి 3న బిహార్‌కు పరారయ్యాడని తెలిపారు. మమత ఝా, అనిల్‌ ఝా అరెస్టు తర్వాత అమర్‌కాంత్‌ను 12న బిహార్‌లో పట్టుకున్నట్లు చెప్పారు.  వికాస్‌ను మాదాపూర్‌ ఎస్‌వోటీæ పోలీసులు 14న అరెస్ట్‌ చేశారన్నారు.   

పక్కా వ్యూహంతో హత్య...
బిహార్‌కు చెందిన బింగీ.. వికాస్‌ కశ్యప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెతో సహజీవనం చేస్తూనే మమత ఝాతోనూ వికాస్‌ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇది గొడవకు దారితీయడంతో వికాస్‌ను మమత ఝా తన కొడుకు అమర్‌కాంత్‌తో పాటు ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌కు పంపింది. కొద్ది రోజులకే మమత ఝా, అనిల్‌ ఝా కూడా హైదరాబాద్‌కు వచ్చారు. నలుగురు ఒకే ఇంట్లో ఉంటున్నారు.

వికాస్‌ ఫోన్‌ కూడా చేయకపోవడంతో గర్భవతి అయిన బింగీ అతని మామ ద్వారా ఫోన్‌ నంబర్‌ తెలుసుకుంది. బింగీ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా వికాస్‌ అడ్రస్‌ మాత్రం చెప్పలేదు. ఒకసారి ఫోన్‌ వికాస్‌ వద్ద పనిచేసే అతను ఎత్తి అడ్రస్‌ చెప్పాడు. దీంతో బింగీ 45 రోజుల క్రితమే సిద్ధిఖీనగర్‌కు వచ్చింది. వికాస్‌ ఆమెకు నచ్చజెప్పి నాగపూర్‌ తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లగానే చెప్పకుండా హైదరాబాద్‌ వచ్చాడు. 48 గంటల్లోనే బింగీ కూడా సిద్ధిఖీనగర్‌ చేరుకుంది.

తాను కూడా ఇక్కడే ఉంటానని చెప్పడంతో వికాస్, మమత జీర్ణించుకోలేక హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. హత్యకు 8 రోజుల ముందే కటింగ్‌ మిషీన్, ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు, బస్తాలు కొనుగోలు చేశారు. మృతదేహాన్ని ఎక్కడ పడేయాలన్న దానిపై రెక్కీ నిర్వహించి బొటానికల్‌ గార్డెన్‌ ప్రాంతంలో వేయాలని నిర్ణయించుకున్నారు. హత్య అనంతరం ఇంటర్‌ పరీక్షలు రాసేందుకు బిహార్‌ వెళ్లిన అమర్‌కాంత్‌ను పోలీసులు కాపుకాసి మరీ పట్టుకున్నారు. అలాగే చాట్‌ బండిని అమ్మేందుకు యత్నిస్తూ వికాస్‌ పోలీసులకు చిక్కాడు.  

మరిన్ని వార్తలు