రహదారి లేక ప్రసవ వేదన  

4 Jul, 2018 12:28 IST|Sakshi
ప్రసవించిన బిడ్డతో బాలింత   

మల్కన్‌గిరి : ఎలాంటి వాహన సదుపాయం లేకపోవడంతో ప్రసవ వేదనలో ఉన్న నిండు గర్భిణిని డోలీ కట్టి తీసుకెళ్లిన ఘటన మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి నువగుఢ పంచాయతీలోని గగోడబోడ గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన తులుహడ అనే గిరిజన మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న మంత్రసానిని ఆశ్రయించారు.

బిడ్డ అడ్డం తిరగడంతోనే నొప్పులు తీవ్రంగా ఉన్నాయని మంత్రసాని చెప్పడంతో భర్త ఆందోళనకు గురయ్యాడు. ఎటువంటి వాహన సదుపాయం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులతో కలిసి డోలీలో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రధాన రహదారికి చేరుకోగానే 108 అంబులెన్స్‌ రావడంతో అందులో భార్యను ఎక్కించి చిత్రకొండ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 

అధికారులు పట్టించుకోవాలి

ఊరికి సరైన రహదారి నిర్మాణం లేని కారణంగా వాహనాలు తిరగడం లేదు. రోడ్డంతా బురదమయం కావడంతో తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.   గ్రామంలో ఏ ఒక్కరు రోగాల బారిన పడినా ఇలానే డోలీలో తీసుకెళ్లాల్సిన దుస్థితి. గ్రామం నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తప్ప ప్రధాన రహదారి కనిపించదు. ఆస్పత్రికి వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి వచ్చే వాహనాలలో మాత్రమే ప్రయాణించాలి.

దీంతో అత్యవసర కేసులను తీసుకెళ్లినప్పుడు మార్గమధ్యంలోనే మృతి చెందుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా