ప్రసవంలో తల్లీ, బిడ్డ మృతి

2 Nov, 2018 11:53 IST|Sakshi
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముట్టడించిన బంధువులు ( ఇన్‌సెట్‌) రమ (ఫైల్‌)

చెన్నై, అన్నానగర్‌: సేత్తియాతోప్పు సమీపంలో బుధవారం మధ్యాహ్నం ప్రసవంలో తల్లీ, బిడ్డ మృతి చెందారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించకపోవడమే ఇద్దరి మరణానికి కారణమని ఆరోపిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బంధువులు ముట్టడించారు. కడలూరు జిల్లా సేత్తియాతోప్పు సమీపం పరదూర్‌చావడికి చెందిన రాజేంద్రన్‌. ఇతని కుమార్తె రమ (20). ఈమెకు భువనగిరి సమీపం అలిచ్చికుడి గ్రామానికి చెందిన రాజా (26)తో ఏడాది కిందట వివాహం జరిగింది. రాజా భువనగిరిలో కంప్యూటర్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఐదు నెలలు గర్భిణీగా ఉన్న రమ, ప్రసవం కోసం పరదూర్‌ చావడిలో తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అక్కడున్న ఒరత్తూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యపరీక్షలు పొందుతూ వచ్చారు.

ఈ స్థితిలో గత 26వ తేదీ హఠాత్తుగా రమకు పురిటినొప్పులు ఏర్పడ్డాయి. ఆమెను కుటుంబీకులు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ రమను పరిశీలించిన వైద్యులు అవి ప్రసవ నొప్పులు కాదని ప్రసవానికి ఇంకా సమయం ఉందని తెలిపి పంపారు. ఈ స్థితిలో గత 29వ తేదీ రాత్రి రమకు ప్రసవ నొప్పులు రావడంతో మళ్లీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పనిలో ఉన్న డాక్టర్లు, ప్రసవానికి ఇంకా సమయం ఉందని చెబుతూ బుధవారం మధ్యాహ్నం వరకు చికిత్స అందించకుండా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో ఓ డాక్టర్‌ చెప్పడంతో రమను వెంటనే చిదంబరం రాజా ముత్తయ్య ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు రమకు ఆపరేషన్‌ చేయగా మగబిడ్డ మృతి చెంది పుట్టాడు. డాక్టర్లు రమకు చికిత్స అందించినప్పటికీ ఆమె కూడా మృతి చెందింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన రమ తల్లిదండ్రులు, భర్త, బంధువులు తగిన సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు చికిత్స అందించకపోవడం వల్ల రమ, బిడ్డ ఇద్దరు మృతి చెందారని ఆరోపిస్తూ ఒరత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముట్టడించారు. సేత్తియాతోపు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 

మరిన్ని వార్తలు