భార్యను బతికించండని వేడుకోవడం కలచివేసింది..

13 Jul, 2020 11:56 IST|Sakshi
సురక్షితంగా బయట పడిన చిన్నారి హర్షిత్‌

అంకిరెడ్డి పల్లె సమీపంలో కారు–లారీ ఢీ

గర్భిణి మృతి..భర్తకు స్వల్పగాయాలు

ప్రాణాలతో బయటపడ్డ ఏడాదిన్నర కుమారుడు

అతను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.  బెంగళూరులో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో  కుటుంబంతో సహా స్వగ్రామానికి బయలుదేరారు. ఓ గంటలో ఇంటికి చేరుకుంటామనుకునేలోపే మృత్యువు దాడి చేసింది. నిండుగర్భిణి  ప్రాణాలనుకబళించింది. కొలిమిగుండ్ల మండలంఅంకిరెడ్డి పల్లె సమీపంలో ఆదివారం లారీ, కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. 

కర్నూలు,కొలిమిగుండ్ల: బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్లకు చెందిన శేగిరెడ్డి నరేష్‌కుమార్‌ రెడ్డి బెంగళూరులో సాప్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడ కరోనా కేసులు అధికమవుతుండటంతో భార్య సుజాత (29),ఏడాదిన్నర వయసున్న కుమారుడు హర్షిత్‌తో కలిసి స్వగ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. నరేష్‌కుమార్‌రెడ్డి సోదరుడు సతీష్‌రెడ్డి   అన్నవదినలను బెంగళూరు నుంచి ఊరికి తీసుకురావడానికి కారులో  వెళ్లారు. అప్పటికే  బైక్‌లో బయలుదేరిన వారికి మార్గమధ్యంలో సతీష్‌రెడ్డి ఎదురయ్యాడు.  బైక్‌ అతడికి ఇచ్చి వారు కారులో  ఊరికి ప్రయాణమయ్యారు. అంకిరెడ్డిపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపైకి చేరుకోగానే  బెలూంకు చెందిన లారీ అవుకు మండలం రామాపురంలోని క్వారీలో నుంచి కంకర లోడ్‌తో ఎదురె ఢీకొన్నాయి.

ఈ ఘటనలో  కారు నుజ్జునుజ్జు అయి ముందు సీటులో కూర్చున్న  సుజాత తీవ్రంగా గాయపడగా, డ్రైవింగ్‌ చేస్తున్న నరేష్‌కుమార్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న ఆమెను 108 అంబులెన్స్‌లో తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది.  తన భార్యను బతికించండని  ప్రమాద స్థలంలో నరేష్‌ స్థానికులను వేడుకోవడం అక్కడి వారిని కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద విషయం తెలియగానే స్వగ్రామం  ఎర్రగుంట్లలో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా