వైద్యం వికటించి బాలింత మృతి

6 Sep, 2019 11:22 IST|Sakshi
ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతిరాలి బంధువులు  సునీత(ఫైల్‌)

సాక్షి, కాజీపేట (వరంగల్‌): వైద్యుల నిర్లక్ష్యం కారణం బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించిన ఘటన కాజీపేట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధర్మసాగర్‌ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మిట్టపల్లి సునిత(31) మూడో కాన్పు నిమిత్తం డీజిల్‌ కాలనీలోని ప్రసాద్‌ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు అన్నిరకాల పరీక్షలు చేసి రెండ్రోజుల క్రితం సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయగా సునిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు కాస్త బలహీనంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులోని సేఫ్టీ బాక్స్‌లో పెట్టడానికి సునిత భర్త సాంబరాజు తీసుకెళ్లాడు.

బుధవారం రాత్రి ఒక్కసారిగా సునిత ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బంధువులు వైద్యం అందించాలని కోరినప్పటికీ సకాలంలో చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రాకపోవడంతో మరణించిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం ప్రసాద్‌ ఆస్పత్రి ఎదుట బైటాయించారు. ముగ్గురు పిల్లలను అనాథను చేసిన ఆస్పత్రి నిర్వాహకులు ఆ కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ధర్మసాగర్‌ జెడ్పీటీసి సభ్యురాలు శ్రీలత, జెడ్పీ కో–ఆప్షన్‌ సభ్యురాలు ఎండీ జుబేదాబేగంతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, మండల ప్రాదేశిక సభ్యులు ఆందోళనకు దిగారు.

పోలీసు బందోబస్తు..
మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేయాలనే డిమాండ్‌తో కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైటాయించడంతో కాజీపేట– హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కాజీపేట ఏసీపీ నర్సింగరావుతో పాటు సీఐలు అజయ్, జానినర్సింహులు సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చ చెప్పి, ట్రాఫిక్‌ను పునరుద్దారించారు.

పరిహారంపై చర్చ..
వైద్యులే సునిత మృతికి బాధ్యత వహించి తగు న్యాయం చేయాలని, బాధితకుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పలువురు ప్రజాప్రతినిధులు ఆస్పత్రి వర్గాలతో చర్చలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు చర్చింనప్పటికీ కొలిక్కిరాలేదు. అయితే వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం ఏమిలేదంటూ పరిహారం ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో రాతిర్ర అయినప్పటికీ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచి ఆందోళన కొనసాగించారు.
ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతిరాలి బంధువులు 
సునీత(ఫైల్‌) 

మరిన్ని వార్తలు