నిండు చూలాలు దారుణ హత్య

6 Sep, 2019 12:43 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ రవీంద్రారెడ్డి, పోలీసులు

రోడ్డు పక్కన పడేసి నిప్పంటించిన దుండగులు

పరిగి మండలం రంగంపల్లి శివారులో ఘటన

వేరే చోట హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం

సాక్షి, పరిగి: నిండు చూలాలును దారుణంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసిన సంఘటన పరిగి మండలం రంగంపల్లి శివారులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగంపల్లి శివారులోని హైదరాబాద్‌– బీజాపూర్‌ రహదారి పక్కన గుంతల్లో కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పరిగి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఎస్‌ఐ చంద్రకాంత్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఒక్క ఎడమకాలి పాదం మినహా పూర్తిగా ఆమె శరీరం కాలిపోయి ఉంది. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతి అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రంలాంటివి లేకపోవడం, ఆమె జననాంగాలకు ఆనుకుని గర్భస్థ శిశువు పడి ఉంది. ఎక్కడో హత్య చేసిన దుండగులు బుధవారం రాత్రి ఇక్కడ పడవేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను తప్పుతోవ పట్టించేందుకే ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా..? అని భావిస్తున్నారు. వాహనం తచ్చాడిన గుర్తులను బట్టి కారులో తీసుకువచ్చి పడేసి ఉంటారని గుర్తించారు.

వివిధ కోణాల్లో దర్యాప్తు..
సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పరిగి లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఆయా పోలీస్‌స్టేషన్లకు పంపించి మిస్సిం గ్‌ కేసుల విషయంలో ఆరా తీస్తున్నారు. చుట్టు పక్కల పోలీస్‌స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.  

అబార్షన్‌ వికటించిందా..?
లభ్యమైన మృతదేహం గర్భవతి కావడంతో పాటు అవివాహితగా అనుమానిస్తున్న పోలీసు లు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాం పక్కన ఆస్పత్రిలో పేషెం ట్లకు కప్పే బట్ట లభ్యం కావడం సంఘటన వెనక మరో కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో గుట్టుగా అబార్షన్‌ చేయిం చేందుకు ప్రయత్నించి అది వికటించడంతో యువతి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందాక మృతదేహాన్ని, శిశువును తీసుకువచ్చి ఇక్కడ పడేసి నిప్పంటించి పరారై ఉంటారా...? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కనిపించకుండాపోయిన వారు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. 94406 27360, 94406 27275లలో తమను సంప్రదించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు