నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది

10 Jun, 2019 07:59 IST|Sakshi
సంగీత మృతదేహం

ఆస్పత్రిలో నిండుగర్భిణి, శిశువు మృతి

ఆందోళనకు దిగిన కుటుంబీకులు

కేసు నమోదు చేసిన పోలీసులు

రాజేంద్రనగర్‌: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణితో పాటు కడుపులో ఉన్న శిశువు మృతిచెందారని పీరంచెరువులోని షాదాన్‌ ఆస్పత్రి వద్ద శనివారం రాత్రి మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం మీర్జాగూడ ప్రాంతానికి చెందిన సురేష్, సంగీత(25) భార్యాభర్తలు. గర్భిణి అయిన సంగీత మూడు నెలలుగా రాజేంద్రనగర్‌ పరిధిలోని షాదాన్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. నెలలు నిండడంతో పది రోజులుగా ఆమె నిత్యం ఆస్పత్రికి వచ్చి చెకప్‌ చేసుకొని వెళ్లింది. ఈ నెల 8న ఆమెను డాక్టర్లు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారు. అయితే, శనివారం ఉదయం నుంచి బాగానే ఉంది. రాత్రి 9 గంటల సమయంలో సంగీతతో పాటు కడుపులో ఉన్న శిశువు మృతి చెందిందని డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సంగీత మృతిచెందిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బంధువులను సముదాయించారు. పంచనామా నిర్వహించి రాత్రి ఉస్మానియా మార్చురీకి సంగీత మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు