ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి

2 Aug, 2018 08:49 IST|Sakshi
విలపిస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు

చిత్తూరు, మదనపల్లె క్రైం :  స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బుధవారం తీవ్ర రక్తస్రావం కావడంతో బాలింత మృతి చెందింది. బాధితుల కథనం మేరకు.. నిమ్మనపల్లె మండలం కొండసానివారిపల్లెకు చెందిన చల్లా శేషాద్రి భార్య సుమతి (23) గర్భం దాల్చింది. మూడు రోజుల క్రితం పుట్టినిల్లు గుర్రంకొండ మండలం తరిగొండ రుద్రవారిపల్లెకు వెళ్లింది. మంగళవారం నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఉమ్మినీరు తక్కువగా ఉందని, ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

కుటుంబ సభ్యుల అనుమతి మేరకు అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు సిజేరిన్‌ చేసి మగబిడ్డను తీశారు. బాలింతకు అధిక రక్తస్త్రావం అవుతుండడంతో డాక్టర్లు రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఆపరేషన్‌ చేశారు. ఆ సమయంలో గర్భసంచిని తొలగించడంతో రక్తస్త్రావం ఆగిపోయింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సుమతికి బీపీ తగ్గి అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను డాక్టర్లే అంబులెన్స్‌లో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. డాక్టర్లు బాలింతను కాపాడలేకపోయారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డ మాత్రం ఆరోగ్యంగా ఉంది.

మరిన్ని వార్తలు