బాలింత దారుణహత్య

28 Mar, 2018 09:29 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌) భారతి (ఫైల్‌) అంజి (ఫైల్‌)

గొడ్డలితో నరికివేత

యువకుడిపై అనుమానం

అదుపులో యువకుడి కుటుంబ సభ్యులు

కోనేటినాయునిపాళ్యం (కేఎన్‌ పాళ్యం)లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన బాలింత హత్యకు గురైంది. దుండగుడు గొడ్డలితో నరికి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

కనగానపల్లి: కేఎన్‌ పాళ్యం గ్రామానికి చెందిన బోయ తిప్పన్న, అంజినమ్మ దంపతుల కుమార్తె భారతి (23)కి రెండేళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ లక్ష్మన్నతో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. బాలింత అయిన భారతి మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమి కోసం సమీపంలోని ముళ్లపొదల వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాచిన దుండుగుడు ఒక్కసారిగా ఆమెపైకి దూకాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న గొడ్డలితో భారతిని విచక్షణారహితంగా నరికి చంపాడు. కాసేపటి తర్వాత హత్య విషయం బయటపడింది. రక్తపుమడుగులో పడి ఉన్న భారతిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. 

హత్యాస్థలిని పరిశీలించిన డీఎస్పీ
బాలింత హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న ధర్మవరం డీఎస్పీ రామవర్మ, రామగిరి సీఐ యుగంధర్‌ వెంటనే కేఎన్‌ పాళ్యం గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే రక్తపు మరకలున్న గొడ్డలి, పురుషుడి చెప్పులు పడి ఉన్నాయి. జాగిలాన్ని రప్పించి హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలింపజేశారు. జాగిలాలు నేరుగా గ్రామంలోని అంజి అనే యువకుడి ఇంటివద్దకు వెళ్లి ఆగాయి. అయితే ఆ సమయంలో అంజి లేకపోవడంతో అతడి తండ్రి రామప్పతోపాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. గతంలో ఒకసారి అంజి అసభ్యంగా ప్రవర్తించడంతో భారతి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు అతడిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు