గుడిలో తవ్వకాలు జరిపిన పూజారి

16 Nov, 2019 09:31 IST|Sakshi
జిన్నాయిగూడెం లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం

గుప్త నిధుల కోసం అన్వేషణ

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

పూజారిని అరెస్టు చేసిన పోలీసులు

తుక్కుగూడ: గుప్త నిధులు కోసం ఓ పూజారి తాను పూజలు చేసే ఆలయాన్నే తవ్వేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన   తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జిన్నాయి గూడెం శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో సత్యంశివంసుందరం దాస్‌ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల నుంచి ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనంది కావడంతో ఇక్కడ గుప్త నిధులతో పాటు స్వామి వారి బంగారు విగ్రహం ఉంటుందని భావించాడు. వాటిని పొందాలని కొంత మందితో కలిసి దాదాపు ఎనిమిది నెలల క్రితం గర్భగుడి ఎదుట సుమారు 12 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టాడు. ఇలా ప్రయత్నించిన అతనికి ఏమీ లభించలేదు. అయితే, ఆ ప్రదేశంలో  గుప్త నిధులు ఏమీ లేకపోవడంతో గొయ్యిని మట్టి వేసి చదును చేశాడు.

ఇలా వెలుగులోకి..
ఈ ఆలయ పూజారి వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖాన్‌పూర్‌కు చెందిన సోను అనే వ్యక్తి శిష్యుడిగా పనిచేశాడు. పూజారితో సోనుకు భేదాభిప్రాయాలు రావడంతో సోను నుంచి ఈనెల 11న ఖాన్‌పూర్‌కు వెళ్లిపోయాడు. ఆలయ పూజారి గుప్త నిధులు కోసం తవ్వకాలు చేసిన సమయంలో సోను తన సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోను సోను గురువారం జిన్నాయిగూడెం, రావిర్యాల వాసులకు పోస్టు చేశాడు. ఈ గ్రామాల నుంచి స్థానికులు ఆలయానికి వస్తుండడంతో వారి ఫోన్‌ నంబర్లు సోను వద్ద ఉన్నాయి. సోను పంపిన వీడియో క్లిప్పింగ్‌లను చూసిన స్థానికులు శుక్రవారం ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పూజారి సత్యంశివంసుందరందాస్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.  విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా