అయ్యో పాపం కీర్తన

2 Mar, 2019 14:21 IST|Sakshi
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కీర్తన

పాఠశాలలో ఆడుకుంటుండగా విద్యుదాఘాతం

తీవ్రగాయాలతో పరిస్థితి విషమం

 ఇప్పటికే రెండు చేతులు  తొలగించిన వైద్యులు

వైద్యానికి రూ.24 లక్షలు ఖర్చవుతుందని తెలిపిన వైద్యులు

ఇప్పటివరకు రూ.13 లక్షలు ఖర్చు 

సాక్షి, నడిగూడెం (కోదాడ) : అధికారులు నిర్లక్ష్యం ఆ విద్యార్థిని ప్రాణాలకు ముప్పుతెచ్చింది. సంబంధిత అధికారులు తమకెందుకులే అనుకోవడంతో ఇప్పుడు ఓ తల్లికి కడుపుకోత మిగిల్చేలా ఉంది. కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎన్నో ఆశలతో ఆ పాఠశాలలో చేరింది. తోటి విద్యార్థులతో నిత్యం ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ గడిపింది. కానీ విధి విద్యుత్‌ తీగల రూపంలో ఆ పసిపాప ప్రాణం ఇప్పుడు విలవిలతాడుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ, నాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నారు ఆ తల్లిదండ్రులు, మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దగ్గుపాటి యేసు, నాగమణిల చిన్న కూతురు కీర్తన. తండ్రి యేసు మూగ. తల్లి నాగమణి కూలినాలి పనులు చేసుకుంటున్నది. ఈ చిన్నారి నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఈ విద్యార్థిని చదువుతోపాటు, ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొనేది. 
రెండు చేతులు తొలగించారు
కీర్తన విద్యుత్‌ఘాతానికి గురై శరీరం తల భాగం తప్ప పూర్తిగా దెబ్బతింది. దీంతో గత నెల 26న ఎడమ చేతిని తొలగించారు. గత నెల 28న కుడిచేయిని కూడా తొలగించారు. విద్యుత్‌ ఘాతంతో శరీరం కుళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారిని చూసిన వైద్యసిబ్బంది, వైద్యులు, బందువులు కన్నీరు పెట్టుకున్నారు. మాటలు రాని తండ్రి యేసు మౌనంగానే రోదిస్తున్నాడు. కన్న తల్లి నాగమణి జీవశ్ఛవాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం కీర్తన చూడడం, మాట్లాడడం చేస్తుంది కానీ అవయవాల్లో కదలికలు లేవు. కీర్తన ఆరోగ్యం కుదుట పడేంత వరకు పూర్తిగా గురుకుల విద్యాలయం సంస్థ ఆధ్వర్యంలోనే చికిత్స చేయిస్తున్నారు.

కీర్తన కోలుకునేందుకు దాదాపు రూ.24 లక్షలు ఖర్చు అవుతుందని, ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రూ.13 లక్షలు ఖర్చు అయ్యింది. పాఠశాల నుంచి ఇద్దరు ఉపాద్యాయులు, ప్రిన్స్‌పాల్‌ భిక్షమయ్య చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజురూ చేసేందుకు, స్థానిక శాసన సభ సభ్యుల ద్వారా దరఖాస్తు కూడా చేశారు. విద్యార్థిని పూర్తి స్థాయిలో కోలుకునేందుకు చికిత్స జరిపిస్తామని కోదాడ ఎమ్యెల్యే మల్లయ్య యాదవ్‌ హామీనిచ్చినట్లు ప్రిన్స్‌పాల్‌ ఎ.భిక్షమయ్య తెలిపారు. విద్యార్థిని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేంత వరకు గురుకుల సంస్థ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్‌ఘాతానికి గురై చికిత్స పొందుతున్న కీర్తన త్వరగా కోలుకోవాలని అనేక మంది విద్యార్థులు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. 

విషమంగా కీర్తన పరిస్థితి
ఈ నెల 16న కీర్తన తన స్నేహితులతో గురుకుల పాఠశాలలోని క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడుతుండగా  ప్రాంగణంలో లభించిన అల్యూమినియ రాడ్‌తో సాధన చేసింది. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణం మీదుగా 33బై కేవీ విద్యుత్‌ తీగలు తక్కువ ఎత్తులో ఉండడం.. ప్రమాదశాత్తు కీర్తన ఆడుకుంటున్న అల్యూమినియం రాడ్‌ విద్యుత్‌ తీగలకు తగలడంతో విద్యుత్‌ ఘాతానికి గురైంది. తీవ్ర గాయాల పాలవ్వడంతో అదే రోజున 108 వాహనంలో కోదాడకు తరలించారు. అక్కడినుంచి ఖమ్మం తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.  ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. 

మరిన్ని వార్తలు