డబ్బుల కోసం కిడ్నాప్‌

27 Sep, 2019 13:29 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌

జైల్లో స్నేహం వారిమధ్యే విభేదాలు

వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌

ఏలూరు టౌన్‌: పలు నేరాలు చేసి ముగ్గురు జైలులో ఖైదీలుగా ఉన్నారు.. వారి మధ్య స్నేహం ఏర్పడింది..ఇద్దరు ముందుగా బెయిల్‌పై బయటకు వచ్చారు. బెయిల్‌ రాకుండా జైలులో ఉన్న స్నేహితుడి కోసం వీరిద్దరూ డబ్బులు ఖర్చు చేసి బెయిల్‌పై స్నేహితుడిని బయటకు తెచ్చారు. తీరా అదే డబ్బు కోసం వారి మధ్య వివాదం ఏర్పడింది. దాంతో కిడ్నాప్‌ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలంటూ దాడి చేసి బెదిరింపులకు దిగారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు రౌడీ షీటర్లు కల్లేపల్లి వేణు, రుప్పా మురళీకృష్ణ, మరో ముగ్గురు దిమ్మిట అనీష్, కొమ్మన ఆనందకుమార్, వెజ్జు కల్యాణ్‌ అనే ఐదుగురు నిందితులను అరెస్టు చేసి  కోర్టులో హాజరుపరిచారు. ఈ సంఘటనకు సంబంధించి ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌ ఏలూరు రూరల్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 

ఏలూరు వైఎస్సార్‌ కాలనీకి చెందిన కల్లేపల్లి వేణు, భావిశెట్టివారిపేటకు చెందిన రుప్పా మురళీకృష్ణ  గతంలో ఏలూరులో సంచలనం రేకెత్తించిన తల నుంచి మొండెం వేరుచేసిన ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిపై పోలీసులు రౌడీషీట్‌ కూడా తెరిచారు. వీరిద్దరూ జైలులో ఉండగా విశాఖపట్టణం ఎంవీపీ కాలనీకి చెందిన కిలపర్తి సందర్శ్‌ పరిచయమయ్యాడు. వీరి ముగురి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలుత వేణు, మురళీకృష్ణ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ స్నేహంతో సందర్శ్‌ను బెయిల్‌పై బయటకు తీసుకువచ్చేందుకు వేణు రూ.30 వేలు ఖర్చు చేశాడు. జైలులో ఉన్నప్పుడు సందర్శ్‌ ఆర్థిక పరిస్థితిని గమనించిన వేణు ఎలాగైనా అతని వద్దనుంచి భారీగా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సందర్శ్‌ బయటకు వచ్చిన అనంతరం వేణు, మురళీకృష్ణ రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు.

వీరిద్దరితోపాటు వైఎస్సార్‌ కాలనీ 9వ రోడ్డుకు చెందిన దిమ్మిటి అనీష్, వైఎస్సార్‌ కాలనీ 6వ రోడ్డుకు చెందిన కొమ్మన ఆనంద్‌కుమార్, ఆర్‌ఆర్‌పేట పానుగంటివారి వీధికి చెందిన వెజ్జు కల్యాణ్‌ అనే మరో ముగ్గురి సహకారంతో సందర్శ్‌ను కారులో కిడ్నాప్‌ చేసి దెందులూరు మండలం గాలాయిగూడెంలోని ఒక తోటలోకి తీసుకువెళ్లి బంధించి, డబ్బులు ఇవ్వాలని లేకుంటే కర్రలతోనూ, బ్రాందీ సీసాలతో దాడి చేసి చంపుతామని బెదిరించారు. పరిస్థితి గమనించిన సందర్శ్‌ వారినుంచి తప్పించుకుని ఈనెల 22న పెదవేగి పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెదవేగి ఎస్‌ఐ బండి మోహనరావు ఈనెల 23న క్రైం నెంబర్‌ 238/19, సెక్షన్‌ 364, 307, రెడ్‌విత్‌ 34 ఐపీసీతో  కేసు నమోదు చేశారు. ఏలూరు డీఎస్పీ దిలిప్‌కిరణ్‌ ఆదేశాల మేరకు ఏలూరు రూరల్‌ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మోహనరావు, హెచ్‌సీ అమీర్, సిబ్బందితో గురువారం ఉదయం 6 గంటల సమయంలో పెదవేగి మండలం వంగూరు బైపాస్‌ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారును, రూ.1000 నగదు, ఫిర్యాదుదారుడు సందర్శ్‌కు చెందిన ఎల్‌జీ ఫోన్, ఏటీఎం కార్డులు, నిందితులకు చెందిన రెండు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు.ఈ సమావేశంలో ఏలూరు రూరల్‌ సీఐ ఏ.శ్రీనివాసరావు, పెదవేగి ఎస్‌ఐ బండి మోహనరావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు