ఖైదీ పరారీయత్నం

21 Mar, 2020 10:04 IST|Sakshi
ఖైదీ ఎర్రిస్వామి

 జిల్లా జైలులో ఘటన

అనంతపురం, బుక్కరాయసముద్రం: రెడ్డిపల్లి సమీపంలో ఉన్న జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పారిపోయేందుకు ప్రయత్నించి కలకలం రేపాడు. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా నేలకుంట గ్రామానికి చెందిన ఎర్రిస్వామి ఏడాది క్రితం గుంతకల్లు సమీపంలో లారీలో వెళ్తూ రైల్వే గేటు ధ్వంసం చేశాడు. దీంతో రైల్వే పోలీసులు ఎర్రిస్వామిపై కేసు నమోదు చేయడంతో కోర్టు అతనికి ఏడాది పాటు జైలు శిక్ష వేసింది. అయితే ఎర్రిస్వామి జనవరి 26న గుత్తి కోర్టు నుంచి అనంతపురం జిల్లా జైలుకు వచ్చాడు.

శుక్రవారం జైలు బయట పరిసర ప్రాంతాలు శుభ్రపరిచే సమయంలో పోలీసుల కళ్లుకప్పి పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు గంటలపాటు జైలు పరిసర ప్రాంతాలన్నీ వెతికారు. చివరికి జిల్లా జైలు సమీపంలో ఉన్న నారాయయప్ప కుంట చెరువు నుంచి అనంత విద్యానికేతన్‌ పాఠశాల వెనుక భాగాన దాక్కున్న ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తీసుకొచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసు సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెమోలను జారీ చేసినట్లు జైలు సూపరిండెంటెడ్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు.   

మరిన్ని వార్తలు