జ్వరంతో ఆస్పత్రికి వెళితే..

22 Aug, 2018 09:24 IST|Sakshi
చికిత్సపొందుతున్న అమర్‌నాథ్‌ గౌడ్‌

పంజగుట్ట: జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వస్తే ఇప్పటి వరకు రూ.8 లక్షలు వసూలు చేసి రోగి ఆరోగ్య పరిస్థితి కూడా చెప్పడం లేదని ఆరోపిస్తూ అతని బంధువులు ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం పంజగుట్ట పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి అమర్‌నాథ్‌ గౌడ్‌ (61) జ్వరంతో బాధపడుతుండటంతో జులై 31న బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.1 లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచిన వైద్యులు ఆరోగ్యం మెరుగుపడిందని రూమ్‌కు మార్చారు. రోగి బంధువులతో కూడా మాట్లాడాడు. అయితే గత ఆదివారం ఉదయం అమర్‌నాథ్‌ ఆరోగ్యం క్షీణించిందంటూ మరోసారి ఐసీయూలోకి తీసుకెళ్లారన్నారు.

అప్పటి నుంచి రోగిని చూడనివ్వకుండా చికిత్స పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని, పరీక్షలు చేయడమే కాకుండా, డయాలసిస్‌ చేస్తున్నట్లు తెలిపారన్నారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి డయాలసిస్‌ ఎందుకని నిలదీయగా బాడీ ఇన్‌ఫెక్షన్‌ అయినట్లు చెప్పారన్నారు. మంగళవారం అమర్‌నాథ్‌ ఉన్న గదినుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా అతని శరీరంపై పుండ్లు ఉన్నట్లు గుర్తించి డాక్టర్‌ను సంప్రదించగా బాడీ ఇన్‌ఫెక్షనై వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపారన్నారు. ఇప్పటికే చికిత్స కోసం రూ.6.5 లక్షలు వసూలు చేశారని, మరో రూ.6 లక్షలు అవుతాయని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని బాధితులు వాపోయారు. అసలు ఐసీయూలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదన్నారు. అయితే ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన రోగి బంధువులను పోలీసులు సముదాయించి ఆస్పత్రి సూపరిండెంట్‌తో చర్చలు జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు