నిర్లక్ష్య వైద్యంతో ముంచావు!

18 Feb, 2019 09:44 IST|Sakshi
ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేస్తున్న ఉమ కుటుంబ సభ్యులు, బంధువులు(ఫైల్‌) వైరారోడ్డులోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ ఎదుట ఆందోళన (ఫైల్‌)

ఖమ్మం వైద్యవిభాగం: వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్న రోగులకు కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల డాక్టర్లు, యాజమాన్య బాధ్యులు నరకం చూపిస్తున్నారు. నిర్లక్ష్యపు వైద్యంతో ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల ఖమ్మం నగరంలో వరుసగా ఇలా..ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది పట్టింపు లోపంతో చనిపోయారని రోగుల బంధువులు సదరు ఆస్పత్రుల ఎదుట ఆందోళనలు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా..బయట పడని, విషయం పొక్కకుండా చర్చించి, డబ్బు ముట్టజెప్పి చేతులు దులుపుకుంటున్న విషాదకర ఘట్టాలు అనేకం ఉంటాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా పదుల సంఖ్యలోనే మరణాలుంటున్నాయనే దారుణమైన సఘంటనలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా చలించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్‌ ఆస్పత్రులు వెలుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచీ ఇక్కడికి వైద్యం చేయించుకునేందుకు వస్తుంటారు. అందిన కాడికి దోచుకోవడమే విధానంగా కొన్ని హాస్పిటళ్ల వారు వ్యవహరిస్తున్నారు. నియంత్రించాల్సిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టారీతిలో యాజమాన్యాలు నడిపిస్తున్నా..వారిపై ఒక్క కఠిన చర్య తీసుకున్న దాఖలాలు కూడా ఇటీవలి కాలంలో కనిపించలేదు. ఫలితంగా మృతుల కుటుంబ సభ్యులకు రోదనలే మిగులుతున్నాయి. తప్పు చోటుచేసుకున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకునే వారే లేరా ? అని పలువురు వాపోతున్నారు.  

నిబంధనలు పాటించకపోయినా అనుమతులు
ఖమ్మ నగరంలో 200 ప్రైవేట్‌ హాస్పిటళ్లు ఉండగా అందులో 110 గైనిక్‌కు చెందినవి కావడం విశేషం. అయితే కొన్ని యాజమాన్యాలు సరైన నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నాయి. అయినా..జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి అనుమతులు వస్తున్నాయి. అర్హులైన డాక్టర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, పారామెడికల్‌ సిబ్బంది ఉండాలి. డాక్టర్ల పేర్లతో పాటు వైద్యుడి ఫీజు, సంబంధిత వైద్యానికి అయ్యే ఖర్చుల వివరాలను తెలిపే బోర్డులను కచ్చితంగా రోగులకు కనిపించేలా ప్రదర్శించాలి. అనర్హులతో కూడా వైద్యం చేయిస్తూ..రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫీజుల విషయంలో కనికరం చూపకుండా ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు చూసీ చడనట్లు ఉన్నందునే..ప్రైవేట్‌ లూటీ, ప్రాణాలతో చెలగాటంపై పట్టింపు కరువైంది అనేది వాస్తవం..అని రోగులు వాపోతున్నారు.  

బాలుడి ప్రాణంతో చెలగాటం
ఖమ్మం వెంకటగిరి ప్రాంతంలో పనులు చేసుకుంటూ ఉంటున్న బిహార్‌ కూలీల కుటుంబాల్లో నిషాంగ్‌ అనే రెండున్నరేళ్ల బాలుడికి కుక్క కరవగా ఇటీవల వైరారోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇతడికి సరైన వైద్యం అందకపోవడంతో రేబిస్‌ వ్యాప్తి చెంది..పరిస్థితి విషమించింది. చివర్లో తమ వల్ల కాదని హైదరాబాద్‌కు పంపడంతో అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే..ఖమ్మంలో నిర్లక్ష్య వైద్యం వల్లే చనిపోయినట్లు అక్కడి డాక్టర్లు తెలిపారని, మృతుడి బంధువులు ఖమ్మంలో ఆందోళన చేశారు.  

 పాపం 7నెలల గర్భిణి
ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఇటీవల మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన గుగులోత్‌ ఉమ(25) అనే 7 నెలల గర్భిణి మృతి చెందింది. ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈమెకు రెండో కాన్పు కోసం ఇక్కడ వైద్యం చేయించుకుంటుండగా..సదరు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కడుపులో పిండం చనిపోయినా చెప్పకుండా రెండు రోజుల పాటు వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌ తీసుకెళ్లాలని తెలిపి చేతులు దులుపుకున్నారు. చివరికి గర్భిణి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఖమ్మంరూరల్‌ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కొప్పుల సంధ్య(24) కూడా నిర్లక్ష్యపు వైద్యం వల్లే చనిపోయింది.

మృతి ఘటనలపై విచారణ చేయిస్తాం..
ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇటీవల రోగులు నిర్లక్ష్య వైద్యం వల్ల చనిపోయారనే ఆరోపణలు, చోటు చేసుకున్న ఘటనలపై విచారణ చేస్తాం. నిబంధనలు పాటించని హాస్పిటళ్లపై తప్పక చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం లేని ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నాం. అవసరమైతే..సీజ్‌ కూడా చేస్తాం. ఎవరైనా నిబంధనలు తప్పని సరిగా పాటించాలిం్సందే. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులిస్తాం. కొంత సమయమిచ్చి సరిదిద్దుకునే అవకాశం కల్పించినా తీరు మారకుంటే..తర్వాత కఠిన చర్యలు తప్పవు.  
– కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు