స్టడీ క్లాస్‌లో వికృత చేష్టలు

14 Feb, 2020 10:33 IST|Sakshi

విద్యార్థులపై కరెస్పాండెంట్‌ కుమారుల లైగింక వేధింపులు

సెల్‌ఫోన్లో చిత్రీకరించి చిత్రహింసలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

కర్నూలు, బొమ్మలసత్రం: స్టడీ క్లాస్‌ల పేరుతో విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కరెస్పాండెంట్‌ కుమారులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు వాటిని సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. బాధితులైన విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇవీ.. నంద్యాల పట్టణం ఎన్జీవోస్‌ కాలనీలో ఓ ప్రైవేట్‌ పాఠశాలను కరెస్పాండెంట్‌ కుమారులు యశ్వంత్‌ , కార్తీక్‌ నిర్వహిస్తున్నారు. వీరి స్నేహితుడు చరణ్‌ అదే పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాలలో చదువుతున్న 9,10 వ తరగతిచదువుతున్న కొందరు విద్యార్థులు స్కూల్‌ ఎదురుగా ఉన్న కరెస్పాండెంట్‌ ఇంటికి స్టడీక్లాస్‌ల కోసం రాత్రి వెళ్లేవారు.

మద్యం సేవించిన యశ్వంత్, కార్తీక్, చరణ్‌లు.. విద్యార్థులను వేధింపులకు గురిచేసేవారు. లోడ్రాయర్‌ వేసుకురాని వారిని వరుసగా నిలబెట్టి వారి మర్మాంగాన్ని స్కేలుతో కొలిచేవారు. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లతో చిత్రీకరించి తోటి విద్యార్థులకు చూపించి వేధించేవారు. విద్యార్థులు ఎదురుతిరిగితే గొడ్డును బాదినట్లు బాదేవారు. విద్యార్థులు భయపడి ఈ విషయంపై ఎక్కడా నోరుమెదిపేవారు కాదు.  రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావటంతో భరించలేని విధ్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు నేరుగా నంద్యాల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు..యశ్వంత్, కార్తీక్, చరణ్‌ల సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. పాఠశాలలో చదువుతున్న బాలికలపై కూడా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావటంతో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు