నకిలీ సిమ్‌కార్డు వ్యవహారం

13 Nov, 2018 11:27 IST|Sakshi

తమిళనాడు, టీ.నగర్‌: నిర్లక్ష్యంగా సిమ్‌ కార్డును మరొక వ్యక్తికి కేటాయించిన ప్రైవేటు టెలికమ్యూనికేషన్‌ సంస్థ వినియోగదారునికి నష్టపరిహారంగా రూ.8.50 లక్షలు చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. చెన్నై జిల్లా ఉత్తర వినియోగదారుల కోర్టులో ఎగ్మూర్‌కు చెందిన పూజన్‌గోయల్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇలా పేర్కొన్నారు. చెన్నై ఐనావరంలోగల ఒక ప్రైవేటు టెలికమ్యూనికేషన్‌ సంస్థలో మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్‌ తీసుకున్నానని, ఈ ఫోన్‌ సాధారణంగా రావాల్సిన బ్యాంకు లావాదేవీల వివరాలు రాలేదని తెలిపారు.

దీంతో టెలికమ్యూనికేషన్‌ సంస్థను సంప్రదించగా సిమ్‌కార్డులో లోపం ఉండొచ్చని తెలిపారని పేర్కొన్నారు. దీంతో కొత్త సిమ్‌కార్డు కొని బ్యాంకు వివరాలు పరిశీలించగా తన బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.7.50 లక్షలు చోరీకి గురైనట్లు తెలిసిందన్నారు. దీనిగురించి టెలికమ్యూనికేషన్‌ సంస్థలో విచారించగా నకిలీ ధ్రువపత్రాలతో వేరొకరికి తన సిమ్‌కార్డును కొత్తగా ఇచ్చినట్లు తెలిసిందన్నారు. దీంతో సదరు సంస్థ తాను పోగొట్టుకున్న సొమ్ముతోపాటు నష్టపరిహారంగా ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి లక్ష్మికాంతం పిటిషనర్‌కు రూ.7.5 లక్షలతోపాటు అదనంగా లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు