కాజల్‌తో భేటీకి రూ.60 లక్షలు!

2 Aug, 2019 07:13 IST|Sakshi
నటి కాజల్‌ అగర్వాల్‌ (ఇన్‌సెట్‌) మోసపోయిన అభిమాని

అభిమానిని మోసం చేసిన నిర్మాత అరెస్ట్‌

సినిమా: సినిమా కథానాయికలపై పిచ్చి అభిమానం ఉండవచ్చు గానీ.. పిచ్చి మోహం ఉండకూడదు. అలాంటి మోహంతోనే ఒక అభిమాని ఎలాంటి దుస్థితికి చేరాడన్న సంఘటన చెన్నై, రామనాథపురంలో జరిగింది. వివరాలు.. రామనాథపురానికి చెందిన 27 ఏళ్ల యువకుడు ఒక వ్యాపారవేత్త కుమారుడు. ఇతను కంప్యూటర్‌లో ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేశాడు. అందులో కొన్ని అశ్లీల దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఆ పక్కనే మీరు ఈ దృశ్యాలను కనుక ఇష్టపడితే సినీ హీరోయిన్‌లను ప్రత్యక్షంగా కలుసుకోవచ్చు అని ఉంది. దీంతో ఇతగాడు ఆ దృశ్యాలను లైక్‌ చేస్తూ, తన ఫోన్‌ నంబరుతో పాటు తన వివరాలను పొందుపరిచాడు. దీంతో అతని సెల్‌ఫోన్‌కు పలువురు హీరోయిన్ల ఫొటోలు వచ్చాయి. వాటిలో మీరు కలుసుకోవాలని కోరుకుంటున్న హీరోయిన్‌ను ఎంపిక చేసుకోమని మెసేజ్‌ వచ్చింది. ఈ యువకుడు తన అభిమాన నటి కాజల్‌అగర్వాల్‌ను సెలెక్ట్‌ చేసుకున్నారు. అనంతరం మీరు ఎంట్రీ కోసం రూ.50 వేలు చెల్లించాలని సమాచారం వచ్చింది. దీంతో అతను తన బ్యాంకు ద్వారా రూ.50 వేలను పంపాడు. ఈ విషయాన్ని ఆ యువకుడు ఇతరులెవరికీ చెప్పలేదు. నటి కాజల్‌అగర్వాల్‌ను కలిసి ఆమెను తన ఇంటికి పిలుచుకురావచ్చని భావించాడు. ఆ యువకుడి కుటుంబవివరాలను తెలుసుకున్న ఆ ఇంటర్నెట్‌ ముఠా ఇతని నుంచి మరింత డబ్బు గుంజవచ్చని భావించారు. మరి కొంత డబ్బు పంపమని మెసేజ్‌లు పంపారు.

దీంతో అనుమానం వచ్చిన ఆ యువకుడు ఇంకా డబ్బు ఇచ్చేది లేదని చెప్పాడు. దీంతో ఆ బృందం పలువురు అమ్మాయిల అశ్లీల ఫొటోలతో ఆ యువకుడి ఫొటోను మార్పింగ్‌ చేసి పంపారు. నువ్వు డబ్బు పంపకపోతే ఈ ఫొటోలను ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తామని, మీ కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన ఈ యువకుడు తను బ్యాంకు నుంచి ఏడు దఫాలుగా రూ.60 లక్షలను వారికి పంపాడు. ఆ ముఠా మరింత డబ్బును డిమాండ్‌ చేయడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి ఇంటి నుంచి పారిపోయాడు. కుమారుడు కనిపించకుండా పోవడంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడు సెల్‌ఫోన్‌ ద్వారా అతను కోల్‌కతాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. విచారణలో మోసగాళ్ల గుట్టు రట్టయ్యింది. దీంతో ఆ యువకుడిని మోసం చేసిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. అందులో చెన్నైకి చెందిన ఒక సినీ నిర్మాత కూడా ఉండడంతో అతని నుంచి కొంత సమాచారాన్ని రాబట్టారు. తాము సినిమా నిర్మించాలన్న ఆశతోనే ఈ మోసానికి పాల్పడినట్లు నిర్మాత చెప్పాడు. అదే విధంగా ఈ ముఠా ఇంకా చాలా మందిని మోసం చేసి డబ్బు రాబట్టినట్లు పోలీసులు వివరించారు.

>
మరిన్ని వార్తలు