అశోక్‌ కుమార్ ఆత్మహత్య వెనుక...

22 Nov, 2017 16:32 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తమిళనాడులోనూ ‘కాల్‌మనీ’ భూతం బుసలు కొడుతోంది. ఏపీలో ఇప్పటికే ఈ రక్కసి బారిన పడి ఎంతో మంది మానప్రాణాలు పోగొట్టుకోగా, తాజాగా పొరుగు రాష్ట్రానికి ఇది పాకింది. కాల్‌మనీ వ్యవహారం కోలీవుడ్‌ దర్శక నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి కారణమైంది. నటుడు శశికుమార్‌ సోదరుడైన ఆయన మంగళవారం చెన్నైలో ఆత్మహత్య చేసుకోవటం సినిమా వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. ఫైనాన్షియర్లు, కాల్‌మనీ దారుల నుండి గత కొంతకాలంగా బెదిరింపులు వస్తుండటంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సూసైడ్ లెటర్‌లో అశోక్ కుమార్ వివరించటం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

దీంతో కోలీవుడ్‌ కాల్‌మనీ దందాకు వ్యతిరేకంగా కదంతొక్కింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్‌ చేసింది. అశోక్ కుమార్‌ను బెదిరించిన వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో కందువడ్డీ, కాల్‌మనీ వ్యవహారంలో ప్రమేయమున్న పైనాన్షియర్లపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గతంలో కాల్‌మనీ వ్యవహారంలో ఓ కుటుంబం తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విదారక ఉదంతాన్ని మరువక ముందే కాల్‌మనీకి సినీ నిర్మాత అశోక్ కుమార్ బలి కావడం తమిళనాట తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని వార్తలు