కీచక ప్రొఫెసర్‌ అరెస్ట్‌

3 Jan, 2020 08:44 IST|Sakshi

వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన 

మంగళగిరి ఎన్నారై కళాశాల ప్రొఫెసర్‌ 

విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని యాజమాన్యం

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసిన పీజీ విద్యార్థినులు.. 

వేధింపులు నిజమేనని నిర్ధారించిన విచారణ కమిటీ

ఎట్టకేలకు ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్‌కు తరలింపు

ప్రొఫెసర్‌ వ్యవహారంపై ఎంసీఐ ఎథికల్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్న వీసీ

సాక్షి, అమరావతి/మంగళగిరి:  నా మాట వినకుంటే ప్రాక్టికల్‌ మార్కుల్లో కోత వేస్తానంటూ వైద్య విద్యార్థినులను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాలలో రేడియాలజీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు వైద్య విద్యార్థినుల్ని లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం ఇటీవల వెలుగు చూడడం తెలిసిందే. ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వైద్య విద్యార్థినులు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీకి తమ గోడు విన్నవించారు. దీనిపై వీసీ చర్యలకు ఉప్రకమించారు. రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్‌ పోలీసులు కీచక ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేయడమేగాక గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టులో హాజరు పరచగా అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌వీవీఎన్‌ లక్ష్మి.. అతనికి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. 

ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు.. 
డా.నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాలలోని రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే కళాశాలలో చదువుతున్న రేడియాలజీ పీజీ వైద్య విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం, రకరకాలుగా వేధించడం చేశారు. వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు ఎన్‌ఆర్‌ఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఎంసీఐ నిబంధనల మేరకు ప్రతి వైద్య కళాశాలలోనూ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేసి, అక్కడకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కళాశాల యాజమాన్యం ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థినులు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. వీసీ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ కమిటీ ఎన్‌ఆర్‌ఐ కళాశాలకెళ్లి విచారణ జరిపి ప్రొఫెనర్‌ వేధింపులు నిజమేనని తేల్చింది. దీనిపై యాజమాన్యాన్ని వీసీ వివరణ కోరగా... ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారని, ఆయన రాజీనామాను ఆమోదించామని బదులిచ్చారు. దీనిపై వీసీ.. రాజీనామా చేసి వెళ్లిపోతే వదిలేస్తారా, పోలీసు కేసు నమోదు చేయరా అంటూ నిలదీశారు. కళాశాల అంతర్గత విచారణలోనూ ప్రొఫెసర్‌ వేధించినట్టు నిర్ధారించాక పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. విద్యార్థినులు జిల్లా ఎస్పీని తాజాగా కలసి ఫిర్యాదు అందజేయడమేగాక ప్రొఫెసర్‌ తీరుపై వీడియోలతోసహా ఆధారాలను సమర్పించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించడంతో మంగళగిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేయడమేగాక నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.  

ప్రొఫెసర్‌ వేధింపులపై ఎథికల్‌ కమిటీకి సిఫార్సు 
ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు వేధింపులపై రెండు కమిటీలు వేయగా వేధింపులు నిజమేనని అవి రెండూ తేల్చాయి. దీంతో భారతీయ వైద్యమండలి ఎథికల్‌ కమిటీకి ఈయన విషయాన్ని సిఫార్సు చేస్తున్నా. వైద్య విద్యార్థినుల స్టేట్‌మెంటుతోపాటు విచారణ కమిటీ నివేదికనూ పంపిస్తాం. ఎథికల్‌ కమిటీ విచారణ జరిపి ఆయన ఎంసీఐ రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తుందా.. ప్రాక్టీస్‌ చేయకుండా చర్యలు తీసుకుంటుందా అన్నది వేచిచూడాలి. 
–డా.కె.వెంకటేష్, వైస్‌ చాన్స్‌లర్‌ (ఇన్‌చార్జి), ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ  

మరిన్ని వార్తలు