ప్రేమ పేరుతో మోసం..

25 Jan, 2019 10:43 IST|Sakshi

పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం..

ఇఫ్లూలో అధ్యాపకుడి నిర్వాకం

ఓయూ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు...

తార్నాక: పెళ్లయి భార్యతో విడాకులు తీసుకున్న అధ్యాపకుడు ప్రేమ,పెళ్లి పేరుతో ఓ విద్యార్థినిని నమ్మించి ఆమెతో సహజీవనం చేయడమేగాక ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మోహం చాటేశాడు.దీంతో బాధితురాలు ఓయూ పోలీసులను ఆశ్రయించింది. తార్నాకలోని ద ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ విద్యార్థిని ఇఫ్లూలో ఎం.ఏ ఇంగ్లిష్‌(ఈఎల్‌టీ) కోర్సు చదువుతోంది. కేరళకు చెందిన రంజిత్‌ తంగప్పన్‌ ఇఫ్లూలో అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌గా పనిచేస్తూ సీతాఫల్‌మండిలో ఉంటున్నాడు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది.

దీనిని ఆసరాగా తీసుకున్న అతను ప్రేమ పేరుతో వలవేశాడు. తనకు వివాహమైందని, భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పి మరింత దగ్గరయ్యాడు. తనకు ఓ తోడు కావాలని, అందుకు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం సదరు విద్యార్థినిని హాస్టల్‌ నుంచి ఖాళీ చేయించి తన ఇంటికి తీసుకువెళ్లగా ఇద్దరు సహజీవనం  చేస్తున్నారు. కొద్దిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఈనెల 12న రంజిత్‌ బాధితురాలిపై చేసుకున్నాడు. ఆమెను పెళ్లి  చేసుకోవడం కుదరదని, హాస్టల్‌కు వెళ్లిపోవాలంటూ ఇంటి నుంచి గెంటేశాడు. ఆమె ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వకపోగా, ఆమె నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టిన రంజిత్‌ ఈనెల 19 నుంచి వారం రోజులపాటు సెలవు పెట్టి కేరళకు వెళ్లిపోయాడు. దీంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు